ఇజ్రాయెల్ బిలియనీర్ ఇయల్ ఓఫర్‌కు చెందిన ఓ నౌకపై అరేబియా సముద్రం ఓమన్ తీరంలో దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో యునైటెడ్ కింగ్డమ్, రోమానియాకు చెందిన ఇద్దరు నౌక సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. కానీ, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలపలేదు.
లైబీరియా నుంచి బయలుదేరిన మెర్సెర్ స్ట్రీట్ ఆయిల్ ట్యాంకర్.. ఓమన్ ద్వీపం మసిరాహ్కు ఈశాన్య సమీపానికి చేరుకున్న క్రమంలో గురువారం రాత్రి ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం ఓమన్ రాజధాని మస్కట్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అయితే.. టెహ్రాన్ అణు ఒప్పందంపై చర్చలు నిలిచిపోయిన క్రమంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ సమయంలో దాడి జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. నౌకపై దాడి తమ పనేనన్న వాదనను ఇజ్రాయెల్ అధికారులు తోసిపుచ్చారు.