Vivek Ramaswamy Polls :2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US Election 2024) రిపబ్లికన్ పార్టీ తరఫున తానే బరిలో దిగవచ్చని ఆ పార్టీ పోటీదారు వివేక్ రామస్వామి ఆశాభావం వ్యక్తంచేశారు. ఒకవేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉంటే.. ఆయనకు మద్దతిస్తానని స్పష్టం చేశారు. ఇక తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే.. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న ట్రంప్‌ను క్షమిస్తానని తెలిపారు. అలా చేస్తే దేశం మళ్లీ ఏకం కావడానికి దోహదపడుతుందని చెప్పారు. తదుపరి దేశాధ్యక్షుడిగా ఇది తన ప్రాధాన్య అంశం కాకపోయినప్పటికీ దేశం ముందుకు సాగడానికి అవసరమని అన్నారు. ఆదివారం ఓ వార్తా సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వివేక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"నేను అమెరికాను ముందుకు తీసుకెళ్లడానికి ఎవరైతే సమర్థులని భావిస్తానో వారికే ఓటు వేస్తాను. అది జో బైడెన్.. కమలా హారిస్ అది ఎవరైనా కావచ్చు. నేను దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను. అందుకే అధ్యక్ష బరిలో ఉన్నాను. ట్రంప్‌పై వచ్చిన అభియోగాలు రాజకీయ ప్రేరేపితమైనవి. ఇది అమెరికాకు హానికరమైన పరిస్థితి. ప్రత్యర్థులను పోటీ నుంచి తొలగించడానికి పోలీసు బలగాలను ఉపయోగించే బనానా రిపబ్లిక్‌గా అమెరికా మారడం నాకు ఇష్టం లేదు"
-- వివేక్ రామస్వామి, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీదారు
Republican Candidates 2024 : గతనెలలో జరిగిన రిపబ్లికన్ పార్టీ తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత వివేక్‌కు ప్రజాదరణ పెరిగింది. సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీతో పోటీపడి ప్రజలను ఆకట్టుకున్నారు. అయితే ట్రంప్‌నకు, 'అతడి అమెరికా ఫస్ట్' విధానాలకు బహిరంగంగా మద్దతు తెలుపుతున్న, ఏకైక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అశావహుడు వివేక్ ఒక్కరే.