Trump International Hotel: వాషింగ్టన్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్‌ను ఆయన కుటుంబం విక్రయించింది. మయామికి చెందిన సీజీఐ మర్చంట్ గ్రూప్ దీన్ని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి ట్రంప్ కుటుంబం బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ హోటల్ విక్రయంతో వాషింగ్టన్లో ట్రంప్ కుటుంబం వ్యాపార ఉనికిని కోల్పోనుంది. అయితే ఉత్తర వర్జీనియాలో ఓ గోల్ఫ్ కోర్టు మాత్రం వారి వద్దే ఉంది.
Trump hotel news: ఈ హోటల్ విక్రయించడం వల్ల ట్రంప్ కుటుంబానికి భారీ లాభాలే దక్కుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 375 మిలియన్ డాలర్లు చెల్లించి సీజీఐ గ్రూప్.. ట్రంప్ హోటల్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థలాన్ని ట్రంప్ కుటుంబం ఫెడరల్ ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకుంది. ఏటా అద్దెతో పాటు లాభాల్లో కొంత వాటా చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో సీజీఐ గ్రూప్ కూడా ఇప్పుడు ఈ హోటల్లో కార్యకలాపాలు మాత్రమే నిర్వహించనుంది. స్థలం మాత్రం వారికి దక్కదు.
Trump news: ట్రంప్ 2016లో అమెరికా అధ్యక్షుడు కావడానికి ముందు 200 మిలియన్ డాలర్లు వెచ్చించి ఈ హోటల్‌ను ఆధునికీకరించారు. ఆయన ఆధికారంలో ఉన్నంతకాలం హోటల్ బాగా నడిచింది. ఆయన మద్దతుదారులు, రిపబ్లికన్లు, విదేశీ లీడర్లు ఈ హోటల్‌కే వెళ్లేవారు. అయితే ట్రంప్‌ను వివాదాలు చట్టుముట్టడం వల్ల హోటల్‌కు తాకిడి తగ్గింది. ఆ తర్వాత ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోవడం, కరోనా ప్రభావం వల్ల హోటల్ వ్యాపారం పడిపోయింది. దీంతో దాన్ని విక్రయించాలని ట్రంప్ కుటుంబసభ్యులు నిర్ణయించారు.
Trump Washington Hotel: మొత్తం 263 గదులున్న ఈ హోటల్లో ఒక్కో గదికి 1 మిలియన్ డాలర్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది సీజీఐ గ్రూప్. 2020లో వాషింగ్టన్లో ఒక్క హోటల్ గదికి సగటున 3,54,000 డాలర్ల ధర మాత్రమే పలికేది. కానీ ఇప్పుడు ట్రంప్ కుటుంబం కుదుర్చుకున్న డీల్ మొత్తం విలువ తెలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారుల సైతం ఆశ్చర్యపోయారు. హోటల్‌ను కొనుగోలు చేసిన రోజే చకచకా పనులు మొదలు పెట్టింది సీజీఐ గ్రూప్. ద్వారం వద్ద ట్రంప్ పేరుతో ఉన్న బోర్డును రాత్రికిరాత్రే తొలగించింది. ఈ హోటల్‌కు కొత్తగా 'వాల్డార్ఫ్ అస్టోరియా' పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:ఉత్తర కొరియాలో కరోనా తొలి కేసు.. కఠిన చర్యలకు కిమ్ ఆదేశం