Russia Martial Law : ఉక్రెయిన్‌లో ఆక్రమించుకుని తమ దేశంలో విలీనం చేసుకున్న దొనెత్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాల్లో రష్యా మార్షల్ లా విధించింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగ అధినేతలకు అదనపు అత్యవసర అధికారాలు దక్కనున్నాయి. ఐతే మార్షల్ లా ద్వారా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే విషయాన్ని పుతిన్ వెల్లడించలేదు.
ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న తర్వాత ఇటీవలే ఈ నాలుగు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన రష్యా.. ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చినట్లు తెలిపింది. వీటిని తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఐతే ఈ నాలుగు ప్రాంతాల్లో రష్యా-ఉక్రెయిన్ బలగాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. రష్యా భద్రత, సురక్షితమైన భవిష్యత్తు, తమ ప్రజల రక్షణకు చాలా కష్టమైన పనులను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా పుతిన్ వెల్లడించారు. ముందుండి పోరాడుతున్న సైనికుల వెంట దేశం మొత్తం ఐక్యంగా నిలిచి ఉందన్నారు.