తెలంగాణ

telangana

ETV Bharat / international

'గాంధీ ఆదర్శాలు ప్రపంచ దేశాలకు స్ఫూర్తి'.. జపాన్​లో మోదీ శాంతి సందేశం

గాంధీ ఆదర్శాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అణు భూమిలో శాంతి సందేశంగా జపాన్‌లోని హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం వివిధ దేశాధినేతలతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

pm-modi-unveils-bust-of-mahatma-gandhi-in-japan-hiroshima
జపాన్‌లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

By

Published : May 20, 2023, 11:23 AM IST

మహాత్మా గాంధీ తన జీవితాన్ని శాంతి, అహింసకు అంకితం చేశారని ఆయన సిద్ధాంతాలు, జీవితం ప్రపంచ నేతలకు స్ఫూర్తినిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఆదర్శాలు కోట్లాది మందికి బలాన్నిస్తాయని పేర్కొన్నారు. జపాన్‌లోని హిరోషిమాలో జీ7 దేశాల సదస్సుకు హాజరైన మోదీ.. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత్‌-జపాన్ మధ్య స్నేహానికి గుర్తుగా భారత్‌.. గాంధీ ప్రతిమను జపాన్‌కు బహుమతిగా ఇచ్చింది. 42 అంగుళాల పొడవైన గాంధీ కాంస్య ప్రతిమను పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామ్ వంజీ సుతార్ తయారు చేశారు.

మోటోయాసు నది ఒడ్డున మహాత్మాగాంధీ ప్రతిమ కొలువుదీరింది. గాంధీ విగ్రహం ఉన్న ప్రదేశం శాంతి, అహింసకు సంఘీభావ చిహ్నంగా విరాజిల్లుతుందని మోదీ అన్నారు. నేటికీ హిరోషిమా అనే పదం వింటేనే ప్రపంచం భయపడుతోందన్న మోదీ.. ప్రపంచం వాతావరణ మార్పులు, ఉగ్రవాదంతో అల్లాడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చిలో తాను బహుమతిగా ఇచ్చిన బోధి మొక్కను హిరోషిమాలో నాటిన కిషిదకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

జపాన్‌లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

ద్వైపాక్షిక చర్చలు
మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ అనంతరం పలువురు దేశాధినేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ సమకాలీన ప్రాంతీయ పరిణామాలు ఇండో-పసిఫిక్‌లో సహకారంపై చర్చించారు. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరు దేశాధినేతలు చర్చించారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉగ్రవాదంపై పోరు, ఐక్యరాజ్యసమితి సంస్కరణలపై కూడా మోదీ, కిషిద చర్చించినట్లు తెలిపింది.

జపాన్​ ప్రతినిధులతో మోదీ సమావేశం
జపాన్​ ప్రతినిధులతో మోదీ సమావేశం

అనంతరం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ ఏడాదితో భారత్-దక్షిణ కొరియా దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయినందున ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత, ఐటీ హార్డ్‌వేర్ తయారీ, రక్షణ, సెమీకండక్టర్ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడానికి నేతలు అంగీకరించారు.

అనంతరం వియత్నాం ప్రధాని ఫామ్‌మిన్ చిన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హిరోషిమాలో ప్రఖ్యాత జపనీస్ రచయిత, హిందీ, పంజాబీ భాషావేత్త, పద్మశ్రీ డాక్టర్ టోమియో మిజోకామితో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సంభాషించారు. జపాన్‌లో భారతీయ సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో రెండు దేశాలను మరింత దగ్గర చేయడంలో మిజోకామి చేసిన కృషికి ప్రధాని ప్రశంసించారు.

జపాన్​ ప్రతినిధులతో మోదీ సమావేశం

జపాన్​ పర్యటన ముగిసిన అనంతరం పపువా న్యూ గినియా దేశానికి మోదీ వెళతారు. అక్కడ మే 22న జరిగే 'ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్' సమ్మిట్​లో ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపేతో కలిసి మోదీ పాల్గొంటారు. ఆ తరువాత ఆస్ట్రేలియాకు వెళ్లి.. మే 22 నుంచి 24 వరకు అక్కడే ఉంటారు. ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్​తో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. దాంతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన వివిధ సంస్థల సీఈఓలతో, వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. అదే విధంగా సిడ్నీలో భారతీయులతో జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు.

ABOUT THE AUTHOR

...view details