Pelosi Visit Taiwan: అమెరికా ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రసెంటేటివ్స్) స్పీకర్ నాన్సీ పెలోసీ ఆసియా పర్యటన.. చైనా, అగ్రరాజ్యం మధ్య అగ్గిరాజేసింది. చైనా హెచ్చరించినా.. తైవాన్ రాజధాని తైపీలో అడుగుపెట్టారు పెలోసీ. ఆమె తైవాన్‌కు వస్తే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చైనా హెచ్చరించినా.. ఆమె వెనక్కి తగ్గలేదు. పెలోసీ పర్యటన నేపథ్యంలో తైవాన్ స్ట్రైట్‌లో చైనా సైనిక విన్యాసాలు చేస్తోంది. అమెరికా సైతం తమ ఆసియా-పసిఫిక్ కమాండ్‌ను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో పెలోసీ.. తైవాన్ పర్యటన క్షణక్షణం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
చైనా హెచ్చరించినా తైవాన్‌లో అడుగుపెట్టిన పెలోసీ.. క్షణక్షణం ఉత్కంఠ
20:17 August 02
చైనా హెచ్చరించినా తైవాన్‌లో అడుగుపెట్టిన పెలోసీ.. క్షణక్షణం ఉత్కంఠ
పెలోసీ పర్యటన నేపథ్యంలో.. చైనా తన యుద్ధ విమానాలను తైవాన్ భూభాగంవైపు పంపినట్లు స్థానికంగా కథనాలు వెలువడుతున్నాయి. 'చైనా సార్వభౌమ భద్రతా ప్రయోజనాలకు భంగం కలిగించేలా పెలోసీ వ్యవహరిస్తే అందుకు అమెరికానే బాధ్యత వహించాలి. తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది' అని అంతకుముందు చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఓ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్ కాల్‌లో మాట్లాడుతూ ఈ విషయంపై గట్టిగానే హెచ్చరించారు.
తైవాన్ తీరంలో అమెరికా యుద్ధ నౌకలు..చైనా హెచ్చరికల నేపథ్యంలో శ్వేత సౌధం కూడా పెలోసీని హెచ్చరించింది. ఆమె తైవాన్ వెళ్తే చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడొచ్చని తెలిపింది. అయినా పెలోసీ వెనక్కితగ్గకపోవడంతో.. అమెరికా అప్రమత్తమైంది. తైవాన్ ద్వీపానికి తూర్పు వైపు తీరంలో అమెరికాకు చెందిన నాలుగు యుద్ధ నౌకలను మోహరించినట్లు రాయిటర్స్ వార్తాకథనం వెల్లడించింది. అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్‌ఎస్ రొనాల్డ్ రీగన్ క్యారియర్ దక్షిణ చైనా సముద్రాన్ని దాటుకుని ఫిలిప్పీన్స్ సముద్రంలోకి చేరుకుందని సదరు కథనం పేర్కొంది. తైవాన్‌కు తూర్పువైపున ఈ యుద్ధ నౌకలు మోహరించినట్లు సమాచారం.
ఇవీ చూడండి:'నిప్పుతో చెలగాటం వద్దు.. అది మీకే ప్రమాదం'.. అమెరికాకు జిన్‌పింగ్ హెచ్చరిక