పాక్ ప్రజల కష్టాలను వర్ణించేందుకు మాటలు చాలడం లేదు. జీవనోపాధి కోసం దాయాది దేశ ప్రజలు.. అష్టకష్టాలు పడుతున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. తమ దేశ ప్రజలనే చావు దెబ్బ కొట్టింది. ప్రజలు కష్టాల్లో మగ్గుతున్నా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటివరరకూ సబ్సిడీలో ప్రజలకు గోధుమపిండిని అందించిన పాక్ ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కసారిగా ఆ సబ్సిడీని ఎత్తేసింది. గోధుమపిండితో పాటు నిత్యావసరాల సరుకులపైనా పాక్‌లోని పంజాబ్ ప్రభుత్వం సబ్సిడీని ఎత్తేసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉన్నా.. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం నిత్యావసర సరుకులను సరసమైన ధరలకు అందించకోవడం స్థానికంగా తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
గోధుమపిండి సహా నిత్యావసరాలపై సబ్సిడీని ఎత్తేసిన ప్రభుత్వం.. ప్రభుత్వ పంపిణీ దుకాణాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తోంది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమను ఆదుకోకుండా పాక్ ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తోందని స్థానిక పౌరులు విమర్శిస్తున్నారు. గోధుమపిండి సహా నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వ దుకాణాల మద్దతుతోనే సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయని విమర్శించారు.
షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినప్పుడు పాక్‌లో పది కేజీల గోధుమపిండి బస్తా 648 రూపాయలు ఉండగా.. సబ్సిడీ ఎత్తేశాక అది 1,150 రూపాయలకు పెరిగింది. 1,150 రూపాయలు చెల్లించినా.. ప్రభుత్వ పంపిణీ దుకాణాల్లో గోధుమపిండి దొరకడం లేదు. పిండిని బ్లాక్‌మార్కెట్‌కు తరలించడం వల్ల అక్కడ 10 కేజీల గోధుమపిండి బస్తా 1,650 రూపాయలకు దొరుకుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నిత్యావసరాల కోసం ప్రజలు వేలాదిగా తరలి వస్తుండడం వల్ల పాకిస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఈ తొక్కిసలాటల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎలాగైనా ఆహారం పొందాలని గంపెడంత ఆశతో వస్తున్న పాక్ ప్రజలు.. తీవ్ర గాయలపాలై ఆస్పత్రుల పాలవుతున్నారు. సబ్సిడీ ఎత్తేసి నిత్యావసరాలు బ్లాక్ మార్కెట్‌కు తరలించి.. నిరాశ, నిస్పృహతో బతుకుతున్న పాక్ ప్రజల గాయాలపై షెహబాజ్ ప్రభుత్వం కారం చల్లుతోందని ప్రపంచవ్యాప్తంగా విమర్శల జల్లు కురుస్తోంది.
ఆహార పంపిణీలో తొక్కిసలాట.. 12 మంది మృతి!
ఇటీవల.. పాక్‌లో ఆహారం పంపిణీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు.. పొరపాటున కరెంటు తీగపై కాలు వేయడం వల్ల షాక్ గురయ్యారు. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగు తీయడం వల్ల తొక్కిసలాట ప్రారంభమై దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. తొక్కిసలాటలో ఒకరినొకరు తోసుకోవడం వల్ల కొంతమంది మురికి కాలువలో పడ్డారని చెప్పారు. బాధితుల్లో చిన్నారులు మినహా.. ఎక్కువ మంది 40 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలు ఉన్నారని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.