Nepal Earthquake 2023 :నేపాల్‌ను వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. 4 రోజుల వ్యవధిలో 3 సార్లు అక్కడ భూకంపం సంభవించింది. తాజాగా పశ్చిమ నేపాల్‌లో రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని.. దీని ప్రభావంతో ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు వచ్చాయని జాతీయ భూకంప అధ్యయన విభాగం తెలిపింది. పలు ఇళ్లు, కార్యాలయాల్లో వస్తువులు కదిలినట్లు సమాచారం. స్థానికులు తమ నివాసాలను విడిచి ఆరుబయట ఉన్న చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు ఉత్తరాన 233 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. దిల్లీలో భారీ భూప్రకంపనలు సంభవించడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఇప్పటికే 153 మంది మృతి
Nepal Earthquake News : అంతకుముందు నేపాల్‌లో గత శుక్రవారం రాత్రి 11.47 గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రత నమోదు కావడం వల్ల 153 మంది మరణించారు. వాయవ్య నేపాల్‌లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో వచ్చిన ఈ విపత్తులో గాయాలపాలైన 150 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 11 మైళ్ల లోతు నుంచి భూకంపం సంభవించినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంతో రుకమ్, జజర్‌కోట్ జిల్లాలు ఎక్కువగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. శనివారం సాయంత్రం వరకు 159 సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. నేపాల్ భూకంప తీవ్రతకు అప్పడు కూడా భారత్‌లోని పలు ప్రాంతాలు కంపించాయి. దిల్లీతోపాటు యూపీ, బిహార్‌లలో ప్రకంపనలు వచ్చాయి.. ప్రజలు ఉలిక్కిపడి ఇళ్లనుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఆదివారం తెల్లవారుజామున కాఠ్‌మాండూకు వాయవ్య దిశలో 169 కిలోమీటర్ల దూరంలో మరో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. నేపాల్‌లో 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం సుమారు 9,000 మందిని బలి తీసుకుని మరో 22 వేలమందిని గాయాలపాల్జేసింది. ఆ తర్వాత పెద్దవిపత్తు ఇదే.