Mexico Body Parts In Bags : ఉత్తర అమెరికా దేశమైన మెక్సికోలో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. జాలిస్కో రాష్ట్రంలో గాడలాజారా అనే పారిశ్రామిక ప్రాంతం సమీపంలోని లోయలో అనుమానాస్పదంగా కొన్ని బ్యాగులను పోలీసులు గుర్తించారు. వాటిని పరిశీలించగా 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలు కనిపించాయి. అవి మహిళ, పురుషుల శరీర భాగాలని స్టేట్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
మే 20న ఒకే కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న దాదాపు 30 ఏళ్లు వయసున్న ఏడుగురు యువతీయువకులు అదృశ్యమయ్యారు. దీంతో వారి అదృశ్యంపై వివిధ రోజుల్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో పోలీసులకు ఈ 45 బ్యాగులు దొరికాయి. అయితే అదృశ్యమైన యువతీయువకులు పనిచేస్తున్న కాల్ సెంటర్ సమీపంలో ఈ బ్యాగులు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆ కాల్ సెంటర్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అంతకుముందు.. ఆ కాల్‌సెంటర్‌లో అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. పోలీసులకు లభ్యమైన బ్యాగుల దగ్గర డ్రగ్స్, రక్తపు మరకలు ఉన్న వస్తువులు, కొన్ని పత్రాలు కూడా లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఆ శరీర భాగాలు ఎవరివనే విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.