Ukraine Theater Ropen: మూడు నెలలకుపైగా రష్యా కొనసాగిస్తోన్న భీకర యుద్ధంతో ఉక్రెయిన్ నగరాలు వణికిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాలు ఇప్పటికే రష్యా ఆధీనంలోకి వెళ్లిపోగా మరికొన్ని నగరాలు మాత్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో మూడు నెలల తర్వాత ఓ థియేటర్ తిరిగి తెరుచుకుంది. అయితే, ప్రదర్శన మొదలుపెట్టిన తొలిరోజే మూడు ఆటలకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం.
Ukraine Russia War: భీకర యుద్ధం వేళ ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడిన రష్యా సేనలు ఆ ప్రాంతాలను సర్వ నాశనం చేశాయి. ఇదే సమయంలో రాజధాని కీవ్‌పై దాడి చేసినప్పటికీ ఉక్రెయిన్ సేనల ప్రతిదాడులతో తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కీవ్‌లో రోజువారీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. వీటితోపాటు సినిమా థియేటర్లు, నేషనల్ ఒపేరా వంటి ప్రదర్శనశాలలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కీవ్ శివారులోని పొదిల్‌లో ఉన్న ఓ థియేటర్ కూడా ప్రదర్శనను మొదలుపెట్టింది.
‘యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారో..? లేదో అని భావించాం. అసలు థియేటర్ గురించి ఆలోచిస్తారా.. అసలు ఆసక్తి ఉందా? అని అనుకున్నాం. కానీ, తొలిరోజు మూడు ఆటలకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోవడం ఎంతో సంతోషంగా ఉంది’ అని నటుల్లో ఒకరైన యురియ్ ఫెలిపెంకో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం కొంతమంది నటులతోనే ప్రదర్శనను కొనసాగిస్తున్నామన్నారు. యుద్ధం సమయంలో ప్రదర్శన ఇవ్వడానికి తొలుత సంకోచించినప్పటికీ.. కీవ్‌కి తిరిగి వస్తోన్న పౌరులను చూసి ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యామని మరో నటుడు కొత్స టొమ్లియాంక్ తెలిపాడు. ‘జీవన ప్రయాణాన్ని కొనసాగించాల్సిందే. అయితే, యుద్ధం జరుగుతోందన్న విషయం మాత్రం మరచిపోకూడదు. నటులు ఏవిధంగా తమవంతు సహాయం చేయగలరనేదే అసలైన ప్రశ్న’ అంటూ ప్రదర్శనకారులు పేర్కొన్నారు.
Russia Ukraine: ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌లో మూడు నెలలకుపైగా యుద్ధాన్ని కొనసాగిస్తోన్న రష్యా సైన్యం.. మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో మునిగిపోయింది. ముఖ్యంగా డాన్‌బాస్ ప్రాంతాన్ని పూర్తిగా వశం చేసుకోవాలని భావిస్తున్న రష్యా.. వ్యూహత్మక నగరమైన సీవీరోదొనెట్స్క్‌పై విరుచుకుపడుతోంది. దీంతో అక్కడ ఉక్రెయిన్-రష్యా సేనల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇటువంటి సమయంలో ఉక్రెయిన్ సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను ఇచ్చేందుకు పశ్చిమదేశాలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి:రూ.7500 కోట్లు కొల్లగొట్టి దుబాయ్ పరార్.. గుప్తా బ్రదర్స్ అరెస్ట్