అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పగ్గాలు చేపట్టిన తర్వాత జిన్‌పింగ్‌తో సమావేశం అవ్వడం ఇదే మొదటిసారి. అమెరికా, చైనా మధ్య ఆర్థిక, భద్రతాపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరుదేశాల అధ్యక్షులు కరచాలనం చేస్తూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ సమావేశానికి ఇండోనేషియా.. బాలిలోని ఓ విలాసవంతమైన హోటల్ వేదికైంది. జీ-20 సదస్సులో పాల్గొనడానికి వచ్చిన బైడెన్, జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ భేటీ ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుందామని జిన్‌పింగ్‌తో అన్నారు. ఇరుదేశాలు కలిసి ప్రపంచ సమస్యలపై కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు. జిన్‌పింగ్‌తో నిజాయితీగా తన అభిప్రాయాలను తెలిపేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
చైనా, అమెరికా అధ్యక్షుల మధ్య జరుగుతున్న అత్యున్నత స్థాయి సమావేశంపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుంటామని తెలిపారు. చైనా-యూఎస్ మధ్య తలెత్తిన విబేధాలను పరిష్కరించుకునే బాధ్యత ఇరుదేశాలపై ఉందని పేర్కొన్నారు. పరస్పర సహకారం కోసం అనువైన మార్గాలను అన్వేషిస్తున్నన్నట్లు ఆయన తెలిపారు. బైడెన్‌తో అన్నివిషయాలపై లోతుగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాని జిన్‌పింగ్ చెప్పారు.