తెలంగాణ

telangana

ETV Bharat / international

బందీల విడుదలకు హమాస్‌ నో- ఒత్తిళ్లకు తగ్గేదేలేదన్న ఇజ్రాయెల్​ - ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

Israel Hamas Hostage Situation : హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. మిగిలిన బందీలను ఇక విడిచి పెట్టేది లేదని హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ తేల్చిచెప్పింది. తాము పెట్టిన షరతులను ఇజ్రాయెల్‌ అంగీకరించి యుద్ధాన్ని ఆపేంత వరకు బందీలను విడిచిపెట్టబోమని స్పష్టం చేసింది. మరోవైపు గాజాపై సైనిక చర్య విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోమని ఇజ్రాయెల్‌ తేల్చి చెప్పింది. బందీల విడుదల యుద్ధంతోనే సాధ్యమని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తెలిపారు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 6:22 PM IST

Israel Hamas Hostage Situation:హమాస్‌ ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం మొదలై రెండు నెలలు దాటుతున్నా, ఇంకా చాలా మంది బందీలు హమాస్‌ గుప్పిట్లోనే ఉన్నారు. బందీలను విడుదల చేయాలని ఒకవైపు ఇజ్రాయెల్‌, మరోవైపు ప్రపంచ దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న తరుణంలో బందీలను విడిచిపెట్టేది లేదని హమాస్‌ తేల్చి చెప్పింది. తమ షరతులను ఇజ్రాయెల్‌ అంగీకరించే వరకు బందీలను విడిచిపెట్టబోమని తెగేసి చెప్పింది. ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని ఆపేంత వరకు బందీలను విడిచిపెట్టేది లేదని హమాస్‌ సీనియర్‌ అధికారి ఒసామా హమ్దాన్‌ స్పష్టం చేశారు. గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న వరుస దాడులు నిలిపివేస్తేనే ఒప్పంద ప్రక్రియ చర్చలు ముందుకు సాగుతాయని ఒసామా చెప్పారు. అయితే, ఇజ్రాయెల్‌లో ఉన్న పాలస్తీనా ఖైదీలందరికీ బదులుగా తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ సైనికులను విడుదల చేస్తామని చెప్పారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 7 వేల మంది పాలస్తీనియన్లను వివిధ నేరాల కింద ఇజ్రాయెల్ సైన్యం పట్టుకుంది. గత నెలలో ఇరువైపుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం వల్ల నాలుగు రోజుల పాటు బందీల విడుదల ప్రక్రియ సాగింది. దాదాపు వంద మంది బందీలను హమాస్‌ విడుదల చేయగా, సుమారు 240 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్‌ విడుదల చేసింది.

ఇజ్రాయెల్​ దాడి దృశ్యాలు
ఇజ్రాయెల్​ దాడి దృశ్యాలు

హమాస్ ఒత్తిళ్లకు లొంగబోము : ఇజ్రాయెల్​
మరోవైపు బందీల విషయంలో హమాస్‌ చేసిన హెచ్చరికలను ఇజ్రాయెల్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. గాజాపై సైనిక చర్య విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోమని తేల్చి చెప్పింది. బందీల విడుదలకు ఇది చాలా అవసరమని పేర్కొంది. సంపూర్ణ విజయం సాధించే వరకు యుద్ధాన్ని కొనసాగిస్తామని ఆ దేశ ప్రధాని నెతన్యాహు తెగేసి చెప్పారు. బందీలను సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు తీసుకొంటున్న దౌత్య, సైనిక చర్యల తీవ్రతను ఇజ్రాయెల్‌ ఏమాత్రం తగ్గించబోదన్నారు. విజయం సాధించడానికి సైనిక పరమైన ఒత్తిడి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే బందీల విడుదలపై చర్చలకు పిలుపులు వచ్చాయని నెతన్యాహు తెలిపారు.

ఇజ్రాయెల్​ దాడి దృశ్యాలు
ఇజ్రాయెల్​ దాడిలో ధ్వంసమైన భవనాలు

200 స్థావరాలపై ఇజ్రాయెల్​ దాడి
హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ వరుస బాంబు దాడులతో విరుచుపడుతోంది. గాజాలో హమాస్‌కు చెందిన రెండు వందల స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ రక్షణ దళం (IDF)ప్రకటించింది. తమ పారాట్రూప్‌ దళాలు గాజాలోని షిజైయ పట్టణంలో హమాస్‌ వినియోగిస్తున్న పలు అపార్ట్‌మెంట్లపై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో పలు ఆయుధాలు, సైనిక పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. దక్షిణ గాజాలో హమాస్‌ కీలకమైన ఆయుధ డంప్‌గా వాడుతున్న ఓ ఇంటిపై తమ దళాలు వైమానిక దాడి చేసినట్టు తెలిపింది. శనివారం గాజాకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జబాలియా నగరంలోని శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరపడం వల్ల దాదాపు 35 మంది మరణించినట్లు గాజా వైద్యారోగ్య శాఖ తెలిపింది. యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 18 వేల 7 వందల మంది పాలస్తీనియన్లు మరణించినట్లు వెల్లడించింది.

ఇజ్రాయెల్​ దాడి దృశ్యాలు
ఇజ్రాయెల్​ దాడిలో ధ్వంసమైన భవనాలు

సొంత బందీలను చంపిన ఇజ్రాయెల్​- శత్రువులుగా పొరపాటుపడ్డామన్న సైన్యం

హమాస్​తో యుద్ధం​- ఆ రెండు దేశాల ఫార్ములాకు ఇజ్రాయెల్ నో- అమెరికా, బ్రిటన్ ఎస్

ABOUT THE AUTHOR

...view details