Israel Ground Attack On Gaza :గాజాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. హమాస్ ఉగ్రవాదుల ఉనికి లేకుండా చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నఇజ్రాయెల్.. గాజాపై ముప్పేట దాడికి దిగబోతోంది. దీని కోసం వైమానిక, నౌకా, సైనిక దళాలు.. భీకర పోరుకు సిద్ధమయ్యాయి. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు గాజా సరిహద్దు వైపు దూసుకొస్తున్నాయి. ఉత్తర గాజా నుంచి వెళ్లిపోవాలని పాలస్తీనా ప్రజలకు ఇచ్చిన గడువు ముగియడం వల్ల ఏ క్షణమైనా దాడులు ప్రారంభమయ్యే అవకాశముంది.
Israel Ground Invasion Started :గాజాపై దాడులను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్‌సైన్యం ప్రకటించింది. వాయు, నౌకా, సైనిక దళాలు సిద్ధమయ్యాయని తెలిపింది. విస్తృత దాడులకు ప్రణాళికలు రూపొందించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. మూడు దళాలు సమన్వయంతో ఈ దాడులు చేస్తాయని ప్రకటించింది. పలు బెటాలియన్లను, బలగాలను మోహరించినట్లు.. యుద్ధం కోసం ఇజ్రాయెల్ అంతటినీ సర్వసన్నద్ధం చేసినట్లు వెల్లడించింది. యుద్ధంలో తదుపరి దశలకూ ప్రణాళికలు రూపొందించినట్లు.. ప్రత్యేకంగా అతి పెద్ద భూతల దాడులకు సిద్ధమయినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇప్పటివరకు యుద్ధంలో ఇరువైపుల 3,500 మంది మరణించారు.
మేమంతా సిద్ధంగా ఉన్నాం : నెతన్యాహు
గతవారం హమాస్ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న గాజా సరిహద్దు కమ్యూనిటీలు కిబ్బట్జ్ బీరీ, కిబ్బట్జ్ క్ఫర్ అజ్జాలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శనివారం పర్యటించారు. మారణకాండ జరిగిన తీరును పారట్రూపర్ బెటాలియన్ అధిపతి నెతన్యూహుకు వివరించారు. ఈ సందర్భంగా 'గాజా స్ట్రిప్‌లో మా యోధులు ముందు వరసలో ఉన్నారు. మేమంతా సిద్ధంగా ఉన్నాము' నెతన్యాహు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
గాజా వలస వాసుల కష్టాలు..
ఉత్తర గాజా నుంచి 24 గంటల్లో దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించడం వల్ల 11 లక్షల మంది ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మెుత్తం 40 కిలోమీటర్ల పొడవున్న గాజాలో 20 కిలోమీటర్లు వారు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో రోడ్ల ధ్వంసం కావడం వల్ల ప్రయాణం నరకప్రాయంగా మారింది. మరోవైపు శనివారం సాయంత్రం 4 గంటల కల్లా వెళ్లాల్సిందేనని ఇజ్రాయెల్ హెచ్చరించడం వల్ల పరిస్థితి దుర్భరంగా తయారైంది. శుక్రవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ నిరంతరాయంగా చేస్తున్న వైమానిక దాడులతో గాజా వాసులు వలస వెళ్లేందుకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో సైన్యం ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేసింది.
శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు తరలింపు కారిడార్లను అందుబాటులోకి తెచ్చింది. ఇళ్లను వీడి వెళ్లద్దని హమాస్ సూచించినా.. ప్రాణ భయంతో ప్రజలు ఉత్తర ప్రాంతాన్ని వీడుతున్నారు. ఛిద్రమైన రోడ్లతో వారి ప్రయాణానికి ఇబ్బంది కలుగుతోంది. ప్రయాణం సజావుగా సాగడం లేదు. యుద్ధం ముగిశాక మళ్లీ రావచ్చని ఇజ్రాయెల్ హామి ఇస్తున్నా.. గాజా వాసులకు నమ్మకం కుదరడం లేదు. తమను ఈజిప్టు సినా ప్రావిన్సుకు పరిమితం చేస్తారని భయపడుతున్నారు.
ఆస్పత్రి ఆవరణలో 35 వేల మంది శరణార్థులు..
ఉత్తర గాజాలో ఆస్పత్రులను ఖాళీచేసే పరిస్థితి లేదని సహాయక సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది చనిపోయారని, గాయాల పాలయ్యారని వివరిస్తున్నారు. అల్ అవదా ఆసుపత్రిలోని రోగులను తరలించడం కష్ట సాధ్యంగా మారంది. ఆస్పత్రి సమీపంలో బాంబులు పడడం వల్ల.. సగమంది రోగులు ఆస్పత్రి బయటే గడిపారు.