Hamas Commander Killed :సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో తమ టాప్ కమాండర్లలో ఒకరైన ఆయ్మన్ నొఫాల్ మృతిచెందినట్లు హమాస్ తెలిపింది. ఈ మేరకు హమాస్ సైనిక విభాగం కస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు మరణించిన హమాస్ మిలిటెంట్లలో నొఫాల్ అత్యంత కీలకమైన హమాస్ కమాండర్ కావడం గమనార్హం.
మరోవైపు, ఇజ్రాయెల్‌పై లెబనాన్ రెండు యాంటీ ట్యాంగ్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో తమ ఇద్దరు సైనికులతో పాటు మరో పౌరుడు గాయపడ్డాడని చెప్పింది.
పదుల సంఖ్యలో పౌరుల మృతి..
Gaza Situation Now :ఉత్తరగాజాను ఖాళీ చేయమని పాలస్తీనా ప్రజలను ఆదేశించిన ఇజ్రాయెల్ దక్షిణ గాజాపై కూడా బాంబుదాడులకు దిగింది. ఇప్పటికే 10 లక్షల మందికిపైగా ఉత్తరగాజాను వీడి దక్షిణ గాజాలో తలదాచుకుంటున్నారు. దక్షిణగాజాపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రఫా నగరంలో 27 మంది, ఖాన్ యూనిస్ నగరంలో 30 మంది మరణించినట్లు హమాస్ అధికారులు తెలిపారు.
భీకరంగా పరస్పర దాడులు..
Israel Hamas War Death Toll :గాజా పౌరులకు సహాయక సామగ్రి అందించడానికి మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికే గాజాలో ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. అయితే తాము హమాస్ మిలిటెంట్ సంస్థ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజాలో ఇప్పటివరకు 2,800 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 వేల మందికిపైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ వైపు హమాస్ రాకెట్లను ప్రయోగిస్తుండటం వల్ల ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులను ఆపడం లేదు.
స్టాండ్బైలో ఇజ్రాయెల్ సేనలు..
Israel Hamas Attack :ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజాలో ఎటు చూసినా శిథిలాలే దర్శనమిస్తున్నాయి. ఈ శిథిలాల్లో 1,200 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. గాజాలో ఆహారం, నీరు, ఇంధన కొరత నెలకొంది. కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాజా నగరంలో సివిల్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశారు. ఇందులో కొందరు వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. గాజాపై భూతల దాడికి దిగేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించింది. దీనిపై రాజకీయ నిర్ణయం కోసం వేచి చూస్తోంది.