గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో పెను విషాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబ సభ్యులంతా బర్త్ డే వేడుకల సందడిలో ఉండగా.. ఆ క్షణంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి ఓ కుటుంబమే బలైపోయింది. అపార్ట్‌మెట్‌లో పెద్ద ఎత్తున ఎగసిపడిన అగ్నికీలల ధాటికి 21మంది బలైపోగా.. వీరిలో 17మంది ఒకే కుటుంబానికి చెందినవారు ఉండటం అందరినీ హృదయాలను కలిచివేస్తోంది.
జబాలియా శరణార్థుల శిబిరం ప్రాంతంలో గురువారం రాత్రి ఓ మూడంతస్తుల భవనంలోని పైఅంతస్తులో అగ్నిప్రమాదం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, ఇంట్లో నిల్వ చేసిన పెట్రోల్ వల్లే ప్రమాదం చోటుచేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఈ పెట్రోల్ ఎలా మండిందనే అంశంపై మాత్రం స్పష్టత లేదని.. దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
రెండు వేడుకలు ఒకేచోట.. అంతా ఆనందం.. అంతలోనే విషాదం..
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా గాజా ప్రాంతం నిత్యం బాంబు మోతతో దద్దరిల్లుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా చెలరేగిన హింస కాకుండా గత కొన్నేళ్లలో అత్యంత ఘోరమైన సంఘటన ఇదేనని అధికారులు పేర్కొంటున్నారు. అబు రాయ అనే వ్యక్తి కుటుంబం నివసిస్తున్న ఈ భవనంలోని పైఅంతస్తులో చెలరేగిన మంటలు అపార్ట్‌మెంట్‌ను పూర్తిగా ధ్వంసం చేశాయని తెలిపారు. ఈ ఘటనపై అబూ రయా కుటుంబానికి చెందిన మరో వ్యక్తి మహ్మద్ అబూరయా మాట్లాడారు.