Britain new king Charles : బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణంతో ఓవైపు ప్రపంచమంతా శోక సంద్రంలో ఉండగా.. మరోవైపు తదుపరి రాజుగా ఛార్లెస్‌ను ప్రకటించేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. రాజు లేదా రాణి కన్నుమూత తర్వాత.. 24 గంటల్లో వారసుడిని ప్రకటించాల్సి ఉంటుంది. శనివారం ఛార్లెస్ అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నారు. ఛార్లెస్‌ను రాజుగా ప్రకటించేందుకు సీనియర్ మంత్రులు, న్యాయమూర్తులు, మత పెద్దలు సమావేశం అవుతారు. ఆ తర్వాత పార్లమెంటును సమావేశపరుస్తారు. ఈ భేటీలో మొదట బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. శాసనకర్తలంతా కొత్త రాజుకు తమ విధేయత ప్రకటిస్తారు. తర్వాత అధికారికంగా ప్రకటన వెలువరిస్తారు. ఆ ప్రకటనపై బ్రిటన్ ప్రధాని, కాంటర్‌బరీ ఆర్చిబిషప్‌తోపాటు, లార్డ్ చాన్స్‌లర్, పలువురు సీనియర్లు సంతకాలు చేస్తారు. అనంతరం రాయల్ బ్యాండ్ వాద్యాల నడుమ ఛార్లెస్‌ను కొత్త రాజుగా ప్రకటిస్తారు. సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లోని ఫెయిరీ కోర్ట్ బాల్కనీ నుంచి 'గార్టర్ కింగ్ ఆఫ్ ఆర్మ్స్'గా వ్యవహరించే అధికారి ఈ ప్రకటన చేస్తారు. గాడ్ సేవ్ ద కింగ్ అని బిగ్గరగా అరుస్తూ ప్రకటన చేస్తారు. 1952 తర్వాత తొలిసారిగా ఈ ప్రకటన వెలువడనుంది.
ప్రకటన వెంటనే వెలువడినా రాజు పట్టాభిషేకానికి మాత్రం.. కొన్ని నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. పట్టాభిషేకానికి అనుసరించే ప్రక్రియ సుదీర్ఘంగా ఉండడమే ఇందుకు కారణమని బకింగ్‌హామ్ ప్యాలెస్ వెల్లడించింది. క్వీన్ ఎలిజబెత్‌ను 1952 ఫిబ్రవరిలో రాణిగా ప్రకటించగా.. పట్టాభిషేకం 1953 జూన్‌లో జరిగింది. 900 ఏళ్లుగా పట్టాభిషేక మహోత్సవం జరుగుతున్న వెస్ట్‌మినిస్టర్ అబేలోనే.. ఈసారి ఛార్లెస్ ప్రమాణ స్వీకారం జరగనుంది.