Afghanistan Beauty Salon Ban : బ్యూటీ సెలూన్ల మూసివేతకు తమ దేశంలోని మహిళలకు నెల రోజుల సమయం ఇచ్చిన తాలిబన్లు.. గడువు ముగిసిన నేపథ్యంలో కఠిన ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సెలూన్లు మూసివేయాలని హెచ్చరించారు. ఇప్పటికే మహిళలను ఉన్నత విద్య, ఉద్యోగాల నుంచి దూరం చేసిన తాలిబన్లు.. ఇటీవల జీవనోపాధిపై దెబ్బకొట్టారు. నెల క్రితమే బ్యూటీ సెలూన్‌లను మూసివేయాలని సూచించిన తాలిబన్లు.. అందుకోసం 30 రోజులు డెడ్‌లైన్విధించారు. తాజాగా ఆ గడువు ముగిసింది. ఐక్యరాజ్యసమితి సహా ఇతర అంతర్జాతీయ సంస్థలు.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా వాటిని తాలిబన్లు పెడచెవిన పెడుతున్నారు.
కాగా, తమ ఆదేశాలను పాటించని వారిపై ఏ చర్యలు తీసుకుంటారనే విషయంలో తాలిబన్లు ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. బ్యూటీ సెలూన్‌లలో అందించే సేవలు ఇస్లాంకు వ్యతిరేకమని తాలిబన్ నాయకులు వాదిస్తున్నారు. అలాగే పెళ్లి సమయంలో వరుడి కుటుంబానికి ఇది మరింత ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తోందని వింత వాదనను తెరపైకి తెచ్చారు. తాలిబన్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత వారమే కాబుల్‌లో బ్యూటీషియన్లు ఆందోళన చేశారు. బ్యూటీ పార్లర్‌లపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ వేల సంఖ్యలో గుమిగూడారు. జీవనోపాధిని దెబ్బతీసి తమ పొట్ట కొట్టొదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తాలిబన్ సేనలు గాల్లోకి కాల్పులు, జల ఫిరంగులను ప్రయోగించి వారిని చెదరగొట్టారు.