south iran earthquake: దక్షిణ ఇరాన్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో నమోదైంది. ఈ ఘటనలో అయిదుగురు మరణించగా, 44 మంది గాయపడ్డారు. దేశ రాజధాని టెహ్రాన్‌కు దక్షిణంగా 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో ఈ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున ఈ ఘటన జరగడం వల్ల ప్రజలు వీధుల్లోకి వచ్చారు. భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గతేడాది ఇదే ప్రాంతంలో సంభవించిన భూకంపం వల్ల ఒకరు మృతి చెందారు.
ఇరాన్‌లో 1990లో సంభవించిన భారీ భూకంపం వల్ల 40,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 2003లో 6.6 తీవ్రతతో బామ్ నగరంలో సంభవించిన భూకంపం వల్ల 26,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 2017లో పశ్చిమ ఇరాన్‌లో 7 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 600 మందికి పైగా మరణించగా, 9000 మంది గాయపడ్డారు.