ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చిన తొలి దేశంగా బ్రిటన్ నిలిచింది. రానున్న వారాల్లో ప్రజలకు టీకాను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఓ ప్రణాళికను రూపొందించింది. అయితే ఈ ప్రక్రియ అంత సులభమైన విషయమా? ఇందులో అడ్డంకులున్నాయా? అసలు బ్రిటన్ ప్రణాళిక ఏంటి?
బ్రిటన్ వద్ద ఎన్ని వ్యాక్సిన్ డోసులున్నాయి?
40 మిలియన్ డోసుల కోసం ఆర్డర్లు ఇచ్చింది బ్రిటన్. కానీ అవి సరిపోవు. ఒక్కరికి రెండేసి డోసులు ఇవ్వాల్సిన నేపథ్యంలో.. 20మిలియన్ మందికే వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. 16ఏళ్లు పైబడిన వారికే టీకా వేయించాలని బ్రిటన్ నిర్ణయించుకున్నప్పటికీ.. మరో 53మిలియన్ డోసులుకుపైగా అవసరం ఉంది.
వ్యాక్సిన్ ఎప్పుడు బయటకొస్తుంది?
బెల్జియం నుంచి వచ్చిన కొన్ని రోజులకు ఫైజర్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నది బ్రిటన్ ప్రణాళిక. వచ్చే వారంలో 8లక్షల డోసులు బ్రిటన్‌కు చేరుకుంటాయని ఆ దేశ ఆరోగ్యశాఖ కార్యదర్శి మ్యాట్ హెన్‌కాక్ ప్రకటించారు. మిగిలిన వాటి కోసం వేచిచూడాలి.
బ్రిటన్ ప్రణాళిక పనిచేస్తుందా?
ప్రణాళిక అమలు చేయడం అంత సులభమైన విషయం కాదు. -70 డిగ్రీల వద్ద టీకాను నిల్వ ఉంచి, పంపిణీ చేయాలి. ఇదే అతిపెద్ద సమస్య. అయితే రిఫ్రిజిరేటర్లోని సాధారణ ఉష్ణోగ్రతల్లో కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచగలిగే అవకాశం ఉండటం సానుకూల అంశం. వ్యాక్సిన్ పంపిణీ కోసం నేషనల్ హెల్త్ సర్వీస్‌ను ఉపయోగించుకోవాలని చూస్తోంది బ్రిటన్. స్థానిక వైద్యులు, వ్యాక్సినేషన్ సెంటర్లను కూడా వాడుకోవాలని చూస్తోంది.
ఇదీ చూడండి:-'ఆ వ్యాక్సిన్‌ను నిల్వ చేయటం పెద్ద సవాలే'
ఎంత కాలం పడుతుంది?
ప్రణాళిక పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. అవసరానికి సరిపడా ఫైజర్ టీకా డోసులు ప్రస్తుతం బ్రిటన్ వద్ద లేవు. మరో రెండు టీకా సంస్థలతో చర్చలు జరుపుతోంది. అవి మోడెర్నా, ఆక్స్ఫర్డ్ టీకాలు. మోడెర్నా మంచి ఫలితాలే ఇస్తున్నప్పటికీ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తక్కువ ప్రభావితమని నివేదికలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి:-శుభవార్త: 94.5% ప్రభావవంతంగా మోడెర్నా టీకా!
'వ్యాక్సిన్ తప్పనిసరి' చేస్తుందా?
'వ్యాక్సిన్‌ను వేసుకోవడం తప్పనిసరి' అనే నిబంధనను బ్రిటన్ తీసుకురాకపోవచ్చు. అయితే అందరూ టీకా వేసుకోవాలని ప్రభుత్వం, ప్రజా ఆరోగ్య సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి.