ప్రపంచవ్యాప్తంగా రెండు వారాలుగా రోజుకు లక్షకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇందులో అమెరికా, దక్షిణాసియాలోనే అధిక భాగం ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ స్పష్టం చేశారు.
తొలుత లక్ష కేసులకు చేరుకునేందుకు 2 నెలల పట్టిందని గుర్తు చేశారు అధనోమ్. అమెరికా, దక్షిణాసియాలోని 10దేశాల్లోనే 75 శాతం కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 81,12,611కు చేరుకుంది. మహమ్మారి బారిన పడి 4,39,051 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా నుంచి 42,13,212 మంది కోలుకున్నారు.
బీజింగ్‌లో కొత్త క్లస్టర్..
50 రోజులుగా ఒక్క కేసు నమోదుకాని బీజింగ్‌లో కొత్త క్లస్టర్‌ను గుర్తించినట్లు టెడ్రోస్ తెలిపారు. ఈ కొత్త కేసుల మూలాలపై దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. చైనా అధికారులకు అదనపు సాయం చేస్తామని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగం చీఫ్ మైఖేల్ రియాన్ వెల్లడించారు.
అమెరికా పైపైకి..
అమెరికాలో కరోనా కేసుల తీవ్రత తగ్గటం లేదు. ఒక్కరోజులో 20,722 కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 21,82,950కు చేరుకుంది. కరోనా బారిన పడి మృతి చెందినవారి సంఖ్య 1,18,283కు పెరిగింది.