'నో-డీల్'తో భారత్, చైనాకు లాభం! ఇప్పుడు ప్రపంచదేశాల చూపు బ్రిటన్‌వైపే ఉంది. బ్రెగ్జిట్ అనంతరం వాణిజ్యపరంగా ఎన్నో మార్పులు జరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఈ ప్రభావంపై ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి మండలి 'నో-డీల్ బ్రెగ్జిట్: ద ట్రేడ్ విన్నర్స్ అండ్ లూసర్స్' పేరిట ఓ నివేదిక రూపొందించింది.
ఎలాంటి ఒప్పందం లేకుండా ఐరోపా సమాఖ్య నుంచి నిష్క్రమిస్తే వాణిజ్య పరంగా బ్రిటన్‌తో సంబంధాలున్న అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ప్రభావితమవుతాయని అంచనా వేసింది.
చిన్నపాటి వాణిజ్య భాగస్వాములు భారీగా నష్టపోయే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. అమెరికా, చైనా మాత్రం భారీ లాభాలు పొందుతాయని స్పష్టం చేసింది.
నివేదికలోని అంశాలు...
- ఐరోపా సమాఖ్య పథకాల వల్ల కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పటి వరకు బ్రిటన్‌కు ఎగుమతులు చేసి లాభాలు పొందాయి. ఇప్పుడు సరైన ఒప్పందంతో బ్రిటన్ తప్పుకుంటే ఐరోపా సమాఖ్యలోని ఒప్పందాలను మార్చుకునేందుకు భాగస్వామ్య దేశాలకు తగిన గడువు లభిస్తుంది.
- ఎలాంటి ఒప్పందం లేకుండా వైదొలిగితే ఇప్పటివరకు లాభాలు పొందిన దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. సుంకాల వల్ల ప్రతికూల పరిస్థితులు చూసిన దేశాలు భారీగా లాభపడతాయి.
- టర్కీ, దక్షిణ కొరియా, నార్వే, ఐస్లాండ్, కంబోడియా, స్విట్జర్లాండ్ దేశాల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
- బ్రిటన్‌కు ఎగుమతుల వల్ల చైనా 10 బిలియన్ డాలర్ల వరకు లాభం పొందుతుంది. అమెరికా 5.3 బిలియన్ డాలర్లు లాభపడుతుంది. జపాన్ విషయంలో ఆ విలువ 4.9 బిలియన్ డాలర్లు. థాయ్‌లాండ్, వియాత్నం, న్యూజిలాండ్, భారత్, దక్షిణాఫ్రికా దేశాలు లాభాలు పొందుతాయి.
ఇదీ చూడండి: సూర్యుడి రహస్యాలకై నాసా అంతరిక్ష నౌక..!