తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా జీవనాడిపై అమెరికా గురి.. అదే జరిగితే! - అమెరికా రష్యా వార్తలు

Ukraine Russia Conflict: ఉక్రెయిన్​ రష్యా సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారీ ఎత్తున బలగాలను మోహరించిన రష్యా.. ఉక్రెయిన్​ను ఆక్రమించుకోవాలని భావిస్తోంది. ఉక్రెయిన్​పై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్న అమెరికా.. రష్యా ఆర్థిక జీవనాడి అయిన నార్డ్​స్ట్రీమ్​-2 గ్యాస్​ సరఫరాపై దెబ్బకొట్టాలని చూస్తోంది. అసలు ఏంటీ నార్డ్​స్ట్రీమ్​-2 పైపులైన్​? ఇది నిర్వీర్యం అయితే రష్యాకు నష్టం తప్పదా?

Ukraine Russia Conflict
ఉక్రెయిన్​ రష్యా వార్తలు

By

Published : Feb 15, 2022, 12:13 AM IST

Ukraine Russia Conflict: ప్రపంచంలో ఆయుధ శక్తి చూపించే రోజులు మారాయి.. ఆర్థిక అవసరాలే ఆయా దేశాలను నడిపిస్తున్నాయి. యుద్ధం చేయాలన్నా వనరుల సమీకరణకు నిధులు కావాల్సిందే. ఆర్థిక వనరులు లేకనే ఉత్తరకొరియా, ఇరాన్‌ వంటి దేశాల వద్ద ఆయుధాలు ఉన్నా.. ప్రత్యర్థులపై దూకుడుగా యుద్ధాలకు వెళ్లలేకపోతున్నాయి. అందుకే ప్రత్యర్థులను అణచివేసేందుకు ఆర్థిక ఆంక్షలు శక్తిమంతమైన ఆయుధాలుగా మారాయి. తాజాగా ఉక్రెయిన్‌-రష్యా సరిహద్దులు బద్దలయ్యేందుకు సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా మారాయి. ఏ క్షణమైనా నిప్పులు చిమ్ముకొంటూ యుద్ధం మొదలు కావచ్చు. ఈ క్రమంలో రష్యాను లొంగ దీసుకోవడానికి ఉన్న ఆయుధాలకు అమెరికా పదును పెడుతోంది. రష్యా ఆర్థిక జీవనాడి అయిన గ్యాస్‌ సరఫరాపై దెబ్బకొట్టాలని చూస్తోంది. ఈ క్రమంలో రష్యా ఐరోపాకు గ్యాస్‌ సరఫరా చేసేందుకు నిర్మించిన నార్డ్‌స్ట్రీమ్‌-2 పైపులైన్‌ను నిర్వీర్యం చేయాలని భావిస్తోంది. కానీ, అదే జరిగితే అమెరికా మిత్ర దేశాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు.

ఏమిటీ నార్డ్‌స్ట్రీమ్‌-2 పైపులైన్‌..!

రష్యాలో భారీ ఎత్తున సహజవాయు క్షేత్రాలు ఉన్నాయి. ఫలితంగా అత్యధికంగా, చౌకగా గ్యాస్‌ ఎగుమతి చేసే దేశాల్లో రష్యా కూడా ఉంది. రష్యా నుంచి చౌకగా గ్యాస్‌ను జర్మనీకి సరఫరా చేయడానికి 750 మైళ్ల పొడవునా బాల్టిక్‌ సముద్రంలో దీనిని నిర్మించారు. ఈ ప్రాజెక్టును 2015లో ప్రకటించారు. దీనిని అమెరికా, యూకే, ఉక్రెయిన్‌, ఐరోపా సమాఖ్యలోని కొన్ని దేశాలు వ్యతిరేకించాయి. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మాస్కోకు ఐరోపా సమాఖ్యపై పట్టు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ, 2021 సెప్టెంబర్‌లో నిర్మాణం పూర్తయింది. దీనికి జర్మనీ నియంత్రణ సంస్థల నుంచి ఇంకా అనుమతి రాలేదు. ఈ పైప్‌లైన్‌ నిర్మాణానికి 11 బిలియన్‌ డాలర్లకు పైగా వెచ్చించారు. దీని నుంచి ఏటా 55 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను సరఫరా చేయొచ్చు. ఇది జర్మనీ సంవత్సరం మొత్తం వినియోగించే దాని కంటే 50శాతం ఎక్కువ. ఈ పైపు లైన్‌ నుంచి రష్యాకు చెందిన గ్యాజ్‌ప్రామ్‌కు 15 బిలియన్‌ డాలర్లకు పైగా వార్షికాదాయం అందే అవకాశం ఉంది. రష్యా గ్యాస్‌ ఎగుమతులను ఈ కంపెనీ చూసుకొంటోంది.

నార్డ్‌స్ట్రీమ్‌-2 పైపులైన్‌

ఆర్థిక అవసరాలే ముఖ్యం..

మధ్య, తూర్పు ఐరోపా దేశాల్లో ఇంధనం రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో రష్యా అక్కడ కీలకమైంది. ఇప్పటికే పలు మార్గాల్లో రష్యా ఐరోపాదేశాలకు గ్యాస్‌ సరఫరా చేస్తోంది. కాకపోతే ఆ దేశాలకు అవసరమైన మొత్తం కంటే తక్కువగానే సరఫరా చేస్తోందని అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ ఇటీవల ఆరోపించింది. ఈ నేపథ్యంలో నార్డ్‌స్ట్రీమ్‌-2 ప్రాజెక్టులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని జర్మనీ తీవ్రంగా యత్నిస్తోంది. రష్యా కూడా అదే కోరుకుంటోంది. కానీ, ఉక్రెయిన్‌ సరిహద్దులను రష్యా దళాలు మోహరించడం వల్ల ఈ ప్రాజెక్టు మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించింది.

రంగంలోకి జర్మనీ..

పరిస్థితి దిగజారకుండా జర్మనీ యత్నాలను మొదలు పెట్టింది. ఇటీవల జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌ శ్వేత సౌధం సందర్శించిన సమయంలో ఈ పైపులైన్‌ను అమెరికా ఆంక్షల గురి నుంచి తప్పించేందుకు యత్నించారు. కానీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మాత్రం ఏ మాత్రం లొంగలేదు. "రష్యా ఆక్రమణ చేస్తే.. ఇక నార్డ్‌స్ట్రీమ్‌-2 పైపులైన్‌ను మర్చిపోవడమే. దాని అంతం మేము చూస్తాము" అని తేల్చి చెప్పారు. ఇక చేసేది లేక జర్మనీ ఛాన్స్‌లర్‌ కూడా బైడెన్‌తో గొంతు కలిపారు. "మేము ఐక్యంగా ఉన్నాము.. మేము తీసుకొనే చర్యలు రష్యా భరించలేని స్థాయిలో ఉంటాయి" అని హెచ్చరించారు.

నిజంగానే ఈ ప్రాజెక్టును అమెరికా అడ్డుకొంటుందా..?

ఈ అంశంపై అమెరికా అధికారులు స్పందిస్తూ.. రష్యా దురాక్రమణకు పాల్పడితే అమెరికా ఈ ప్రాజెక్టుపై చర్యలు తీసుకొంటుందని చెప్పారు. కానీ,ఎలాంటి చర్యలో వివరించలేదు. బైడెన్‌ ఇటీవల స్పందిస్తూ.. "నేను పక్కాగా చెబుతున్నా.. మేము అది చేయగలం" అని పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా 2017, 2019, 2020ల్లో కొన్ని ఆంక్షలు విధించింది. జనవరి 2021 జనవరిలో ట్రంప్‌ పాలన చివరి సమయంలో మరికొన్ని ఆంక్షలు విధించారు. ఈ ప్రాజెక్టు ఉపయోగంలోకి రాకుండా అడ్డుకొనే శక్తి తమకు ఉందని అమెరికా చెబుతోంది.

ఈ ప్రాజెక్టు కోసం పనిచేసే కంపెనీలను ఆర్థిక ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఆ కంపెనీలకు బ్యాంకింగ్‌ సౌకర్యాలు దూరమవుతాయి. దీంతో పైప్‌లైన్‌ నిర్వహణ కష్టమవుతుంది. మరోపక్క రష్యా దూకుడు కారణంగా జర్మనీ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావడం కూడా కష్ట సాధ్యంగా మారుతుంది. ఎందుకంటే వీటి అనుమతులు పూర్తిగా చట్టాల ఆధారంగా లభిస్తాయి గానీ.. రాజకీయ జోక్యంతో కాదు.

పరస్పరం ఆధారపడిన వ్యవస్థలు..

ఐరోపా ఖండానికి రష్యా నుంచి లభించే చౌక గ్యాస్‌ అవసరం ఉంది. అదే సమయంలో గ్యాజ్‌ప్రామ్‌ ద్వారా ఐరోపా నుంచి లభించే సొమ్ము అవసరం రష్యా బడ్జెట్‌కు ఉంది. ఇప్పటికే ఐరోపా సమాఖ్య చాలా సందర్భాల్లో గ్యాజ్‌ప్రామ్‌తో యాంటీ మోనోపోలి నిబంధనలు పాటించేలా ఒత్తిడి చేసి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో అమెరికా నార్డ్‌స్ట్రీమ్‌-2పై ఒత్తిడి పెంచి రష్యా దూకుడుకు కళ్లెం వేయాలని చూస్తోంది.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details