భారత్‌లో ఉత్పరివర్తనం చెందిన 'బీ1.617.2' తరహా కరోనా వైరస్ వ్యాపించకుండా టీకాల ప్రభావం 'చాలా వరకు తక్కువగానే' ఉంటుందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఆంటోని హార్న్‌డెన్ అభిప్రాయపడ్డారు. ఆయన బ్రిటన్‌లోని టీకాలు, వ్యాధినిరోధక కార్యక్రమాల సంయుక్త సంఘానికి ఉపాధ్యక్షునిగా కూడా వ్యవహరిస్తున్నారు. మార్పులు చెందిన ఈ వైరస్‌ను 'పట్టించుకోదగ్గ రూపాంతరం' (వేరియంట్ ఆఫ్ కన్సర్న్- వీఓసీ)గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇది టీకాలకు లొంగదని, దీని ద్వారా వ్యాధి తీవ్రత పెరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇలా ఉత్పరివర్తనం చెందిన వైరస్‌పై ఇంకా పరిశోధనలు జరగలేదని కూడా తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగానే పై విషయాన్ని చెబుతున్నట్టు తెలిపారు. బ్రిటన్‌లో కూడా 'బీ1.617.2 వీఓసీ' తరహా లక్షణాలు కనిపించడంతో లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని శనివారం ఓ వార్తా సంస్థ ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన వివరణ ఇచ్చారు.
"తక్కువ స్థాయిలో వ్యాధి లక్షణాలు ఉన్నవారిపై టీకాలు స్వల్ప సమర్థతతో పనిచేస్తాయి. అదే వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు సమర్థంగానే ఉంటాయి. వ్యాధి లక్షణాలు తక్కువగా ఉన్నప్పుడు పూర్తి సమర్థత చూపని టీకాలు, వ్యాధి విస్తరణను అరికట్టడంలోనూ పూర్తి సమర్థతను ప్రదర్శించలేవు"
-- ప్రొఫెసర్ ఆంటోని హార్న్‌డెన్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం