కరోనా.. ప్రస్తుతం భారత్ సహా ప్రపంచదేశాలను కలవరపెడుతోన్న మహమ్మారి. ఈ ప్రాణాంతక వైరస్ ధాటికి ఎందరో బలైపోతున్నారు. రోజురోజుకూ వేలకొద్దీ కేసులు, మరణాలు పుట్టుకొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 199కిపైగా దేశాలకు పాకిన కొవిడ్-19 తీవ్రతను ఎలా తగ్గించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ఇప్పటివరకు కేసులు 7 లక్షలను మించాయి. దాదాపు 34 వేల మందిని బలితీసుకుందీ కరోనా. ఇటలీలో అత్యధికంగా 10 వేల 779 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మరణాల సంఖ్య 756. కొత్తగా నమోదైన 5217 కేసులతో మొత్తం కేసులు లక్షను సమీపించాయి.
ఐరోపా సంఘం(ఈయూ)లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇటలీలో కరోనా దెబ్బకు పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో లక్షల మందికి ఆదాయం కరవైంది. తినడానికి తిండి కూడా లేక పలువురు అలమటిస్తున్నారు. తాజాగా సిసిలీ ప్రాంతంలో సూపర్ మార్కెట్లను స్థానికులు లూటీ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గుంపులుగా సూపర్ మార్కెట్లలోకి ప్రవేశించిన జనం.. తమకు కావాల్సినవి తీసుకొని, డబ్బులు చెల్లించకుండానే బయటకు పరిగెత్తారు.
అక్కడ రాకుమారి కూడా..
ఇటలీ తర్వాత స్పెయిన్‌లో వైరస్ విలయతాండవం చేస్తోంది. 24 గంటల వ్యవధిలో అక్కడ 821 మంది మరణించారు. ఆదివారం మరో 6 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడిన స్పెయిన్ రాకుమారి మరియా థెరిసా మరణించినట్లు అక్కడి రాజ కుటుంబం వెల్లడించింది.
యూకేలోనూ మరణాల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. మరో 209 మంది చనిపోగా, మొత్తం మృతులు 1228కి చేరారు. కేసులు 20 వేలకు చేరువలో ఉన్నాయి.
ఫ్రాన్స్‌లో ఇప్పుడిప్పుడే కరోనా మరింత వేగంగా విస్తరిస్తోంది. ఆదివారం అక్కడ 292 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 2,606కు చేరింది. కేసులు 40వేలకుపైమాటే.
అమెరికా...