కరోనా సంక్షోభ సమయంలో కార్యకలాపాల పునరుద్ధరణ మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ అన్నారు. ఇది విపత్తును ఆహ్వానించటమేనని అభిప్రాయపడ్డారు.
కరోనా వ్యాప్తిని నియంత్రించటం కన్నా సాధారణ పరిస్థితుల పునరుద్ధరణపైనే ప్రపంచ దేశాలు దృష్టి సారించాయని విమర్శించారు. రెండింటినీ సమతూకం చేయటం అసాధ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
నాలుగు అంశాలు కీలకం..
ప్రపంచ దేశాలు, సమాజాలు.. నాలుగు అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని టెడ్రోస్ ఉద్ఘాటించారు.
- భారీ సమూహ వ్యాప్తిని నివారించటం
- తీవ్ర సంక్షోభంలో ఉన్నవారిని కాపాడటం
- వ్యక్తిగత రక్షణకు ప్రజలు చర్యలు తీసుకోవటం
- బాధితుల సన్నిహితులను గుర్తించి వేరు చేసి వారికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించటం.
ఇదీ చూడండి:ఇతర వైద్య సేవలపై కరోనా ప్రభావం: డబ్ల్యూహెచ్ఓ
వ్యాక్సిన్‌పై సూచనలు..
కరోనా వైరస్‌ను ఎదుర్కోవటంలో భాగంగా పలు దేశాలు చేపట్టిన వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకుంటున్న వేళ డబ్ల్యూహెచ్ఓ పలు సూచనలు చేసింది. ప్రజా వినియోగానికి ఆమోదం తెలిపేందుకు వేగవంతంగా అనుమతులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. నిరూపితం కాని వ్యాక్సిన్ వాడకంతో దుష్ర్పభావాలు కలిగే ఆస్కారం ఉందని హెచ్చరించింది.
తీవ్రత పెరిగేందుకు ఆస్కారం..
వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం త్వరలోనే ఆమోదం తెలుపుతామని అమెరికా ఎఫ్‌డీఏ పేర్కొన్న మరుసటి రోజే డబ్ల్యూహెచ్ఓ ఈ సూచనలు చేసింది. వేగంగా వ్యాక్సిన్ ఆమోదించటం వల్ల పలు ప్రమాదాలున్నాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ స్పష్టం చేశారు.
"ఈ చర్యతో క్లినికల్ ట్రయల్స్‌ను మున్ముందు కొనసాగించడం కష్టమవుతుంది. ఫలితంగా తగినంత అధ్యయనం జరగని వ్యాక్సిన్ వల్ల దాని సామర్థ్యం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది వైరస్‌ను పూర్తిగా అంతం చేయకపోగా.. తీవ్రత పెరగడానికి కారణమవుతుంది." అని స్వామినాథన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నుంచి వచ్చిన పూర్తి డేటా ఆధారంగానే... వ్యాక్సిన్‌కు ఆమోదం తెలపాలని వస్తున్న సూచనలపై దేశాలు అత్యంత జాగ్రత్తతో వ్యవహారించాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
ఇదీ చూడండి:మూడో దశకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్