పర్యావరణ పరిరక్షణ కోసం లండన్ జంతుప్రదర్శనశాల అధికారులు వినూత్న ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా మొక్కల నుంచి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తున్నారు. దానితో మొక్క తనకు తానుగా సెల్ఫీ తీసుకునే ఏర్పాటు చేశారు. ఈ ఆలోచన జూ సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తోంది... ఆలోచింపజేస్తోంది.
లండన్ నగరంలోని 'జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్' (జెడ్ఎస్ఎల్)... సభ్యులు ప్రపంచంలోనే మొదటిసారిగా మొక్కల సెల్ఫీ అనే వినూత్న ఆలోచన చేశారు. అందుకోసం జూలోని మొక్కలకు సూక్ష్మజీవుల ఇంధన కణాలను ఎరువుగా వేస్తున్నారు. దీని ద్వారా మొక్క నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని వినియోగించి మొక్క తనకు తానుగా సెల్ఫీ తీసుకుంటుంది.
"మేము సజీవ మొక్కల నుంచి (విద్యుత్) శక్తిని ఉత్పత్తి చేస్తున్నాము. మొక్కల సెల్ఫీ తీయడానికి ఎంతో ఉత్తేజకరమైన ప్రయోగం... ఈ జంతుప్రదర్శనశాలలో నిర్వహిస్తున్నాం. ఇందులో మొక్క శక్తిని నిల్వ చేస్తుంది. దానిని మేము ఫోటో తీయడానికి వినియోగిస్తాం." - అలాస్డైర్ డేవిస్, జెడ్ఎస్ఎల్ పరిరక్షణ సాంకేతిక నిపుణుడు