గత కొన్నేళ్లుగా బ్రెగ్జిట్ బిల్లుపై నెలకొన్న ప్రతిష్టంబనకు తెరపడింది. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ ఒప్పందానికి ఆ దేశ పార్లమెంటు ఆమోదం తెలిపింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో గురువారం జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్ బిల్లుకు అనుకూలంగా 330 ఓట్లు, వ్యతిరేకంగా 231 ఓట్లు వచ్చాయి. విపక్ష లేబర్ పార్టీ బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తూ ఓటేసింది.
‘జనవరి 31న ఈయూ నుంచి విడిపోబోతున్నాం. ప్రధాని బోరిస్ జాన్సన్ ఇచ్చిన హామీ నెరవేరబోతోంది’ అని జాన్సన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.
ఇటీవల జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించడం వల్ల బ్రెగ్జిట్ బిల్లు పార్లమెంటులో సునాయాసంగా గట్టెక్కింది. ఈయూ నుంచి వైదొలుగుతున్న తొలి దేశంగా బ్రిటన్ నిలవనుంది.
ఈయూ నుంచి విడిపోతే బ్రిటన్ సామాన్య దేశంగా మిగిలిపోతుందని, వాణిజ్యపరంగా నష్టపోతుందని పలువురు వాదించగా.. బ్రెగ్జిట్‌తో బ్రిటన్‌కు లాభమేనని, గతవైభవం సాధించేందుకు ఇది దోహదపడుతుందని మరి కొందరు వాదించారు.
బ్రెగ్జిట్ బిల్లు హౌస్ ఆఫ్ లార్డ్స్, యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందడం లాంఛనమే కానుంది.