ఇరాన్‌తో తాము వివాదం కోరుకోవడం లేదని, దౌత్యపరమైన పరిష్కారం కోసమే ప్రయత్నిస్తున్నామని బ్రిటన్ విదేశాంగ మంత్రి జెరెమీ హంట్ ఉద్ఘాటించారు. గల్ఫ్ తీరంలో తమ దేశ నౌకలను ఇరాన్ నిర్బంధించడంపై యూకే అత్యవసర కమిటీ సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఒమానీ జలాల్లో మా దేశానికి చెందిన చమురు నౌకను ఇరాన్ అదుపులోకి తీసుకుంది. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు."-జెరెమీ హంట్, బ్రిటన్ విదేశాంగ మంత్రి
ప్రతీకారం కోసమే..
ఈ నెల మొదట్లో 'గ్రేస్ 1' అనే ఇరానీ సూపర్ ట్యాంకర్‌ను బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. తమ నౌక విషయంలో జరిగిన దానికి ప్రతీకారంగానే బ్రిటీష్ నౌకను స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు గురించి తమకు బాగా తెలుసని ఇరాన్ గార్డియన్ కౌన్సిల్ అధికార ప్రతినిధి అబ్బాస్ అలీ తెలిపారు.