తెలంగాణ

telangana

ETV Bharat / international

హాంకాంగ్​ నిరసనలు: ఆందోళనలు హింసాత్మకం

హాంకాంగ్​లో నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగిపోతున్నాయి ..9 వారాల నుంచి నిరవధికంగా కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.  10 లక్షల మందితో శాంతియుతంగా మొదలైన ఉద్యమం..ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది.

హాంకాంగ్​ నిరసనలు: ఆందోళనలతో ఉద్రిక్తం

By

Published : Aug 8, 2019, 11:50 AM IST

Updated : Aug 8, 2019, 4:14 PM IST

ఆందోళనలు హింసాత్మకం

హాంకాంగ్​... ఎత్తైన భవనాలకు, పర్యటక ప్రాంతానికి పెట్టింది పేరు. ప్రస్తుతం ఇక్కడ అస్తిత్వం కాపాడుకునేందుకు ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా 9 వారాల కిందట మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు హింసాత్మకంగా మారింది. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పోలీసులు కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న కొద్దీ ఆందోళనలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఫలితంగా రోజురోజుకు హాంకాంగ్..​ సంక్షోభం ఊబిలో కూరుకుపోతోంది.

నేరస్థుల అప్పగింత బిల్లుతో మొదలైన ఉద్యమం

నేరస్థులను చైనా సహా ఇతర దేశాలకు అప్పగించే బిల్లును హాంకాంగ్‌ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రతిపాదించింది. ఫలితంగా... బిల్లును నిరసిస్తూ హాంకాంగ్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. తైవాన్‌లో ఓ హత్య కేసు నిందితుడు హాంకాంగ్‌లో తలదాచుకుంటున్నట్లు సమాచారం. 1997లో నేరస్థుల అప్పగింత ఒప్పందం ఖరారైనప్పుడు చైనా, తైవాన్‌లను అందులో చేర్చలేదు. సరైన చట్టం లేనందున హాంకాంగ్‌ ప్రభుత్వం అతడిని అప్పగించలేని పరిస్థితి. ఒక దేశం, రెండు వ్యవస్థలు ఉండడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో...చైనా ప్రభుత్వం ఈ బిల్లు ప్రవేశపెట్టించింది.

పార్లమెంటు ముట్టడి

19వ శతాబ్దంలో రాచరిక పాలన ఉన్నప్పుడు చైనా నుంచి బ్రిటన్ .. హాంకాంగ్‌ను 99 ఏళ్ల లీజుకు తీసుకుంది. 1997లో గడువు ముగియడం వల్ల జులై 1న హాంకాంగ్‌ను తిరిగి చైనాకు అప్పగించింది. ఇందుకు సంబంధించిన వేడుకలు జరుగుతుండగానే నిరసనకారులు పార్లమెంటులోకి చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారు. తలుపులను బద్దలు కొట్టారు. ఆందోళన కారులను అణచివేసేందుకు వారిపై పోలీసులు బాష్పవాయువు​ కూడా ప్రయోగించారు. ఫలితంగా అక్కడంతా ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ ఏడాది జూన్​ 10న లక్షలాది మంది శాంతియుతంగా చేపట్టిన ప్రదర్శనతో మొదలైన ఈ ఉద్యమం.... ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది.

వ్యతిరేక గళానికి ముప్పే?

హాంకాంగ్​ శాసనసభలో ఉన్నవారంతా చైనాకు అనుకూలంగా ఉన్నవారే. హాంకాంగ్​ ప్రభుత్వం చైనా చెప్పినట్లే ఉంటుంది. చైనాలో రాజకీయ అసమ్మతికి చోటు లేదు. కానీ డ్రాగన్​ ప్రభుత్వంతో ఏకీభవించని వారు హాంకాంగ్​లో ఉన్నారు. అటువంటి వారిని అక్కడి ప్రభుత్వం ద్వారా అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది చైనా. ప్రస్తుతం జరుగుతోంది అదే.

ఈ నేరస్థుల అప్పగింత బిల్లు ముసుగులో చైనా ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతుందన్నది ఆందోళనకారుల వాదన. అంతే కాదు.. ప్రభుత్వ వ్యతిరేకుల్ని చైనాకు తీసుకెళ్లి అణచివేసే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. హాంకాంగ్‌ న్యాయవ్యవస్థ, స్వతంత్రతకూ రక్షణ కరవైందని అంటున్నారు. దాదాపు 9వారాలుగా ప్రతి ఆదివారం వీరంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ బిల్లును నిరవధికంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా...హాంకాంగ్ వాసులను భయం వీడట్లేదు.

నిరసనకారుల ప్రధాన డిమాండ్లు ఇవే

నేరస్థుల అప్పగింత బిల్లును ఉపసంహరించుకోవడం, పోలీసుల హింసాత్మక చర్యలపై దర్యాప్తు చేయడం, హాంకాంగ్​ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కారీలామ్​ రాజీనామా చెయ్యటం.. ఇవి నిరసనకారుల నుంచి బలంగా వినిపిస్తున్న ప్రధాన డిమాండ్లు.

1997 తర్వాత మళ్లీ ఇప్పుడిలా..

ఈ నిరసనల వల్ల హాంకాంగ్​ పర్యటక రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. 1997 తర్వాత హాంకాంగ్​ సంక్షోభంలో కూరుకుపోవడం మళ్లీ ఇప్పుడే. ఈ ఏడాది జూన్‌లో 80% మంది చైనీయులు హాంకాంగ్ పర్యటనకు వచ్చారు. ఆ తర్వాత.. అల్లర్ల కారణంగా 30-50% మంది పర్యటకులు తమ ప్రయాణం రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. 1997 నాటికి చైనా జీడీపీలో హాంకాంగ్‌ వాటా 16%....ఇప్పుడది 2 శాతం మాత్రమే.

చైనా ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం చేయటంలో హాంకాంగ్‌ ఇప్పటికీ తోడ్పడుతోంది. చైనా ఇదంతా తెలిసి కూడా హాంకాంగ్‌పై పెత్తనం చెలాయించాలని చూస్తోందన్న వాదనా బలంగా వినిపిస్తోంది. మరి ఈ ప్రజా ఉద్యమం ఏ మేర చైనాపై ఒత్తిడి పెంచుతుందన్నదే సవాలు.

Last Updated : Aug 8, 2019, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details