చైనా అండ చూసుకొని భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన పాకిస్థాన్ ఎట్టకేలకు తోకముడుస్తోంది. ఒకప్పుడు ఐరాసలోనూ భారత్‌పై లేనిపోని ఆరోపణలతో విషం చిమ్మిన దాయాది దేశం ఇప్పుడు శాంతి వచనాలు వల్లెవేస్తోంది. పాక్ దుర్భుద్ధిని ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రపంచ వేదికలపై ఏకాకిని చేసి బుద్ధి చెప్పాలన్న భారత ప్రయత్నం ఫలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తమ అసత్య ప్రచారాలకు ఏ దేశమూ అండగా నిలవకపోగా.. ఎఫ్‌ఏటీఎఫ్ ఆర్థిక ఆంక్షల కత్తి వేలాడుతుండడంతో పాక్ అసలు వాస్తవాల్ని గుర్తించక తప్పలేదు. సరిహద్దుల్లో ఆంక్షల ఉల్లంఘనల దగ్గరి నుంచి కశ్మీర్ విషయం వరకూ కాస్త మెత్తబడ్డట్లు కనిపిస్తోంది.
అంతర్గత అంశం
అధికరణ 370 రద్దు భారత అంతర్గత అంశమంటూ ఓ స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు ఇదే అంశంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఏకంగా భారత రాయబారిని ఇస్లామాబాద్ నుంచి పాక్ తిప్పి పంపింది. అంత కఠిన వైఖరి నుంచి పాక్ ఒక్కసారిగా దిగి రావడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అయితే అధికరణ 370 రద్దును భారత్‌లోని ప్రజలు సైతం హర్షించడం లేదంటూ ఖురేషీ తన ఊహాలోకాన్ని ఆవిష్కరించారు.