తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇజ్రాయెల్​లోనూ 'మహా' ప్రతిష్టంభన- మళ్లీ ఎన్నికలే!

ఇజ్రాయెల్​లో రాజకీయ సంక్షోభానికి ఇప్పట్లో తెర పడేలా కనిపించడంలేదు. ప్రతిపక్ష పార్టీ సైతం ఇచ్చిన గడువులోపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని కూడగట్టలేకపోయింది. ఫలితంగా... సంవత్సర కాలంలో మూడోసారి ఎన్నికలు జరిగే పరిస్థితి నెలకొంది.

ఇజ్రాయెల్​లోనూ 'మహా' ప్రతిష్టంభన- మళ్లీ ఎన్నికలే!

By

Published : Nov 21, 2019, 10:49 AM IST

ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా రాజకీయ సంక్షోభం తలెత్తిన ఇజ్రాయెల్​లో ప్రధాన విపక్షం సైతం ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో విఫలమైంది. అంతకుముందు ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినందున... ప్రత్యర్థికి అవకాశం కల్పించారు.

ప్రభుత్వ ఏర్పాటుకు ఇచ్చిన 28 రోజుల గడువు బుధవారం ముగిసింది. ఎన్నికల్లో రెండో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న బ్లూ అండ్ వైట్​ పార్టీ అధినేత బెన్నీ గంట్జ్​ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతును కూడగట్టలేకపోయారు. ఫలితంగా ఇజ్రాయెల్​లో మరోసారి ఎన్నికలు జరిగే పరిస్థితి తలెత్తింది. ఆ దేశంలో ఇప్పటికే ఈ ఏడాది రెండు సార్లు ఎన్నికలు జరిగాయి.

మరి ఇప్పుడేంటి?

ఇజ్రాయెల్​ చట్టం ప్రకారం ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలకు మరో​ 21 రోజల ప్రత్యేక సమయం ఇస్తారు. ఈ గడువులోగా ఏదో ఒక పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కూడగట్టాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఇజ్రాయెల్​ ప్రజల కోసం మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు గంట్జ్​.

తర్వాతా ఇదే ఫలితం..!

120 స్థానాలున్న ఇజ్రాయెల్​ పార్లమెంట్​లో ఆధిక్యం కోసం 61 స్థానాలు అవసరం. గత ఎన్నికల్లో అన్ని పార్టీలు ఆ సంఖ్యకు ఆమడ దురంలో నిలిచాయి. 33 స్థానాలతో బ్లూ అండ్ వైట్​ పార్టీ పార్లమెంట్​లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. నెతన్యాహు సారథ్యంలోని అధికార పార్టీ లికుడ్ 32 స్థానాలకు పరిమితమైంది.

ప్రభుత్వ ఏర్పాటులో అన్ని పక్షాలు విఫలమైతే మార్చిలో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఎగ్జిట్​ పోల్స్ అంచనాల ప్రకారం ఆ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details