తెలంగాణ

telangana

ETV Bharat / international

'వుహాన్​లో భయానక రోజులు గడిపాం'

వుహాన్​లో నివసిస్తున్న జపాన్​ వాసులు ఎట్టకేలకు ప్రత్యేక విమానంలో టోక్యో చేరుకున్నారు. కరోనా వైరస్​ వల్ల అక్కడ భయానక రోజులు గడిపినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత దేశానికి చేరుకోవడం ఎంతో ఉపశమనాన్నిచ్చిందని అన్నారు. మరోవైపు వైరస్​ ప్రభావం విమాన సేవలపై భారీగా పడింది. పలు దేశాలు తమ విమాన కార్యకలాపాలను రద్దు చేసుకుంటున్నాయి.

Japanese evacuated from Wuhan describe fear in virus epicentre
'వుహాన్​లో భయానక రోజులు గడిపాం'

By

Published : Jan 29, 2020, 6:46 PM IST

Updated : Feb 28, 2020, 10:27 AM IST

'వుహాన్​లో భయానక రోజులు గడిపాం'

ప్రాణాంతక కరోనా వైరస్​తో చైనా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే 130మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో చైనాలోని తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు ప్రపంచదేశాలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. తాజాగా కరోనాకు కేంద్రబిందువైన వుహాన్​లో నివసిస్తున్న 206మంది జపాన్​వాసులు ప్రత్యేక విమానంలో టోక్యోకు చేరుకున్నారు. హనేడ విమానాశ్రయంలో వారికి స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహించారు. అనారోగ్యంతో సతమతమవుతున్న ఐదుగురు ప్రయాణికులను వెంటనే ఆసుపత్రులకు తరలించారు.

వుహాన్​ నుంచి వచ్చిన ప్రయాణికులు మాస్కులతో దర్శనమిచ్చారు. వైరస్​ నేపథ్యంలో ఎన్నో భయానక రోజులు గడిపినట్టు తెలిపారు. వుహాన్​తో ప్రపంచానికి సంబంధాలు తెగిపోవడం వల్ల తీవ్ర ఆందోళన చెందినట్టు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో సొంత దేశానికి చేరుకోవడం ఎంతో ఉపశమనం కలిగించిందని వివరించారు.

"విమానం ఎక్కిన తర్వాతే నాకు నిద్రపట్టింది. మేమంతా ఎంతో ఉపశమనం పొందాం. చాలా అలసిపోయాం. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. సరకు పంపిణీపై ఉన్న ఆంక్షలే ఇందుకు ముఖ్య కారణం. ఈ ప్రాణాంతక వైరస్​ జపాన్​కు సోకకుండా తగిన చర్యలు చేపట్టడం ఎంతో అవసరం. కానీ ఇలాంటి సమయంలో చైనాకు మద్దతుగా ఎలాంటి సాయమైనా చేయాలని నేను కోరుకుంటున్నా."
--- టకియో అయామ, నిప్పాన్​ స్టీల్​ ఉద్యోగి.

విమానసేవల పరిస్థితి...

కరోనా వైరస్​ ప్రభావం విమాన సేవలపై భారీగా పడింది. చైనాకు వెళ్లే విమానాలపై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా బ్రిటిష్​ ఎయిర్​వేస్.. డ్రాగన్​ దేశానికి తమ విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమ ప్రాధాన్యమని పేర్కొంది.
అంతకుముందు రష్యాకు చెందిన ఉరల్స్​​​ ఎయిర్​లైన్స్​ కూడా ఐరోపాకు పలు విమాన సేవలను రద్దు చేసుకుంది. వాటిల్లో ఎక్కువ శాతం చైనా పర్యటకులు ఉండటమే కారణమని స్పష్టం చేసింది.

టొయోటా బంద్​...

వైరస్​ మహమ్మారితో ఉక్కిరిబిక్కిరవుతున్న చైనా ప్రభుత్వానికి మరో షాక్​ తగిలింది. దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టొయోటా... చైనాలోని తమ ప్లాంట్లను తక్షణమే మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 9వరకు ప్లాంట్లల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగవని తెలిపింది. ఫిబ్రవరి 10న అప్పటి పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.

ఇదీ చూడండి:- కరోనాపై ఫైట్​ కోసం కొత్త వైరస్- ఆసీస్ శాస్త్రవేత్తల ఘనత

Last Updated : Feb 28, 2020, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details