2015 అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తామని ఆదివారం ప్రకటించిన ఇరాన్... సోమవారం అన్నంత పని చేసింది. 4.5 సాంద్రతకు మించి యురేనియాన్ని శుద్ధి చేశామని ఇరాన్ అణుశక్తి సంస్థ అధికార ప్రతినిధి బెహ్రౌజ్ కమల్వాందీ ప్రకటించారు.
"4.5 సాంద్రత స్థాయిలో యురేనియం శుద్ధి చేయడం... దేశంలోని విద్యుత్ ప్లాంట్ల ఇంధన అవసరాలకు పూర్తిగా సరిపోతుంది."- ఇస్నా వార్తా సంస్థ
అణ్వాయుధాల కోసం 90 శాతం స్వచ్ఛత కలిగిన యురేనియం అవసరమవుతుంది. ఇరాన్ మాత్రం కేవలం ఇంధన అవసరాల కోసమే యురేనియం శుద్ధి కార్యక్రమం చేపట్టిందని కమల్వాందీ స్పష్టం చేశారు.అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) 'యురేనియం శుద్ధి నమూనాలు' తీసుకోవచ్చనీ ఆయన పేర్కొన్నారు.
చమురు అమ్మకాలు క్షీణత, ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ సతమతమవుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే అణుఒప్పందం కట్టుబాట్లను మరింత మీరాల్సి ఉంటుందని ఇరాన్ ఉపవిదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘి హెచ్చరించారు.
ఐఏఈఏ
ఇరాన్ 300 కి.గ్రా. పరిమితి అధిగమించిందని.. ఐఏఈఏ ధ్రువీకరించింది. ఇరాన్ అణుకార్యక్రమంపై జులై 10న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
ఈయూ హెచ్చరిక
ఇరాన్ అణుఒప్పందం ఉల్లంఘించడాన్ని ఐరోపా సమాఖ్య తప్పుబట్టింది. ఈ చర్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే యురేనియం శుద్ధీకరణ ఆపాలని...లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
అణుఒప్పందంలో భాగస్వాములైన ఐరోపా దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్... ఇరాన్ అణుఒప్పందానికి కట్టుబడి ఉండాలని కోరాయి. మరోవైపు ఇరాన్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో... ఆ దేశంపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.
అమెరికాదే తప్పు..
అమెరికా దుందుడుకు విధానాలే...ఇరాన్ అణుఒప్పందం ఉల్లంఘనకు పాల్పడడానికి కారణమని ఆరోపించాయి చైనా, రష్యాలు. ఈ రెండు దేశాలూ అణుఒప్పందంలో భాగస్వాములు కావడం గమనార్హం.
ఇదీ జరిగింది..
2015లో అమెరికాతో పాటు మరికొన్ని దేశాలతో ఇరాన్ అణుఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఇరాన్ 3.67 శాతం కంటే ఎక్కువ సాంద్రతను మించి యురేనియాన్ని శుద్ధి చేయకూడదు. అయితే ఇరాన్‌పై పలు ఆరోపణలు చేస్తూ అమెరికా ఆ ఒప్పందం నుంచి వైదొలిగింది. అనంతర పరిణామాల్లో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై పలు ఆంక్షలూ విధించారు. ఈ చర్యలపై అసహనం వ్యక్తం చేసిన ఇరాన్ తాజాగా యురేనియం శుద్ధిని ప్రారంభించింది.
ఇదీ చూడండి: అమెరికా రాజధాని వాషింగ్టన్లో భారీ వర్షం