తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ కర్తార్​పూర్​ చర్చల కమిటీపై భారత్​ అభ్యంతరం

కర్తార్​పూర్​ కారిడార్​ కమిటీ విషయంలో దిల్లీలోని పాక్​ డిప్యూటీ హైకమిషనర్​కు భారత్​ నోటీసులు జారీ చేసింది. కమిటీలో ఖలిస్థాన్​ వేర్పాటువాదులకు చోటు కల్పించటంపై వివరణ కోరింది. ఏప్రిల్​ 2న జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

పాక్​ కర్తార్​పూర్​ చర్చల కమిటీపై భారత్​ అభ్యంతరం

By

Published : Mar 29, 2019, 7:07 PM IST

Updated : Mar 30, 2019, 7:25 AM IST

పాక్​ కర్తార్​పూర్​ చర్చల కమిటీపై భారత్​ అభ్యంతరం
కర్తార్​పూర్​ నడవా(కారిడర్​) అంశంపై దిల్లీలోని పాకిస్థాన్​ డిప్యూటీ హైకమిషనర్​కు భారత్ సమన్లు జారీ చేసింది. పాక్​ ఏర్పాటు చేసిన పీఎస్​జీపీసీ (పాకిస్థాన్​ సిక్కు గురుద్వారా ప్రబంధక్​ కమిటీ)లో ఖలిస్థాన్​ వేర్పాటువాదులకు చోటు కల్పించటంపై భారత్​ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై పాక్‌ స్పందించిన తర్వాతే కారిడార్‌ నిర్మాణ విధివిధానాలపై తదుపరి సమావేశం ఉంటుందని స్పష్టం చేసింది. నడవా నిర్మాణంలోని సాంకేతిక అంశాలపై వాఘా సరిహద్దులో ఏప్రిల్​ 2న ఇరుదేశాల మధ్య సమావేశం జరగాల్సి ఉంది. పాక్​ తన కమిటీలో ఖలిస్థాన్​ వేర్పాటువాదులను చేర్చినందున భారత్​ ఈ చర్చలను వాయిదా వేసింది.

కారిడార్‌ నిర్మాణ ప్రక్రియపై పది మంది సభ్యులతో కూడిన పీఎస్​జీపీసీ(పాకిస్థాన్​ సిక్కు గురుద్వార ప్రబంధక్​ కమిటీ)ని పాక్‌ ప్రకటించింది. ఇందులో ఖలిస్థాన్​ వేర్పాటు వాదులను చేర్చింది.

గతేడాదే ఇరుదేశాల్లోనూ పునాదిరాయి

భారత్​ - పాక్​ మధ్య ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కర్తార్​పూర్​ కారిడార్​ నిర్మాణానికి గతేడాది నవంబర్​లో ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. నవంబర్​ 26న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ కలిసి పంజాబ్​లోని గురుదాస్​పూర్​లో కారిడార్​ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. రెండు రోజుల తర్వాత పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ కూడా పాక్​లోని నారోవల్​లో శంకుస్థాపన చేశారు. ​

పూర్తయితే సులభంగా రాకపోకలు

ఈ నిర్మాణం పూర్తయితే మన దేశంలోని పంజాబ్‌ గురుదాస్‌పూర్ నుంచి పాక్‌లోని కర్తార్​పూర్‌కు నేరుగా రాకపోకలు సాగించవచ్చు. కర్తార్‌పూర్ సాహిబ్ అనేది పాకిస్థాన్‌లోని రావి నది ఒడ్డున ఉన్న ఓ ప్రముఖ గురుద్వారా. సిక్కుల మతగురువు గురునానక్ జీవితంలోని చివరి క్షణాలను ఇక్కడే గడిపారు. అందుకే సిక్కులు ఈ ప్రాంతాన్ని పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు.

పాక్ స్పందన

ఇరుదేశాల మధ్య ఏప్రిల్​ 2న జరగాల్సిన సమావేశాన్ని భారత్​ వాయిదా వేయటం విచారకరమని పాకిస్థాన్​ దౌత్యవేత్త మహమ్మద్ ఫైజల్​ ట్వీట్​ చేశారు.

"కర్తార్​పూర్​ కారిడార్​పై ఏప్రిల్​ 2న వాఘా సరిహద్దులో జరగాల్సిన ​ సమావేశాన్ని భారత్​ వాయిదా వేయటంపై పాకిస్థాన్​ విచారం వ్యక్తం చేస్తోంది. కారిడార్​ నిర్మాణంలోని ప్రధాన సమస్యలను గుర్తించి ఏకాభిప్రాయానికి వచ్చే విధంగా చర్చలు జరగాల్సింది.

మార్చి 19న సాంకేతిక అంశాలకు సంబంధించి సమావేశం ప్రయోజనకరంగా జరిగినా... పాకిస్థాన్​ అభిప్రాయాలు తెలుసుకోకుండా భారత్​ చివరి నిమిషంలో సమావేశాన్ని వాయిదా వేయటం సమంజసం కాదు. "
- మహమ్మద్​ ఫైజల్​, పాకిస్థాన్​ దౌత్యవేత్త

Last Updated : Mar 30, 2019, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details