ఓ వృద్ధాశ్రమంలో పని చేసే కేర్ వర్కర్.. మే 12న కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వైరస్ బారినపడ్డారు. అనంతరం ఆశ్రమంలోని మరో సహోద్యోగితో పాటు అందులో నివాసముండే ఓ వ్యక్తికి కూడా పాజిటివ్‌గా తేలింది. ఆ వ్యక్తి కూడా ఫైజర్ టీకా తొలిడోసు తీసుకున్న వారే కావడం గమనార్హం. ఆస్ట్రేలియా విక్టోరియాలో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న క్రమంలో ఈ తరహా కేసులు బయటపడుతుండటం అక్కడి ప్రభుత్వానికి ఆందోళన కల్గిస్తోంది. దీంతో టీకా తీసుకున్న తర్వాత(Covid Vaccine) ఎన్ని రోజులకు పని చేస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై పరిశోధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం..
టీకా తీసుకున్న తర్వాత ఎన్ని వారాలకు పని చేస్తుంది?
- కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న రెండు వారాల తర్వాతే రక్షణ లభిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది.
- టీకా వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు దాదాపు తగ్గుతాయి. ప్రాణాపాయం ఉండదు.
- వ్యాక్సినేషన్ తర్వాత కూడా వైరస్ సోకితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. మీ నుంచి ఇతరులకు వైరస్ సోకే ముప్పు తగ్గుతుంది.
- తొలి డోసు తర్వత కూడా కొన్ని ప్రయోజనాలుంటాయి. కానీ రెండు డోసులు తీసుకుంటేనే టీకా పూర్తి సమర్థవంతంగా పని చేస్తుంది.
ఫైజర్ టీకా తొలి డోసు ప్రభావమెంత?
- రెండు డోసులు తీసుకున్న వారం రోజుల తర్వాతే టీకా సామర్థ్యాన్ని పరీక్షించాలని ఫైజర్(pfizer vaccine ) క్లినికల్ ట్రయల్స్ వివరాలు సూచిస్తున్నాయి. అయితే తొలి డోసు తీసుకున్న 12 రోజుల తర్వాత కూడా కొంత రక్షణ లభిస్తుందని స్పష్టం చేశాయి.
- వాస్తవ డేటాను పరిశీలిస్తే ఫైజర్ టీకా తొలి డోసు తీసుకున్న 4 వారాల తర్వాత ప్రభావం చూపుతుందని, ఆస్పత్రిలో చేరే అవకాశాలు 50 శాతం తగ్గుతాయని తెలుస్తోంది.
- ఫైజర్ తొలి డోసుతో వైరస్ బారినపడే అవకాశాలు 50 నుంచి 90 శాతం వరకు తగ్గుతాయని పరిశోధనలు పేర్కొన్నాయి.
- ప్రాథమిక వివరాలను పరిశీలిస్తే ఫైజర్ టీకా తొలి డోసు తీసుకున్న వారికి వైరస్ సోకితే.. వారి ద్వారా ఇతరులకు వ్యాధి వ్యాపించే అవకాశం 50 శాతం తగ్గుతుంది.
ఆస్ట్రాజెనెకా(కొవిషీల్డ్) సింగిల్ డోసు ప్రభావమెంత?
- ఆస్ట్రాజెనెకా(కొవిషీల్డ్) టీకాను(AstraZeneca vaccine) తొలుత సింగిల్ డోసు టీకాగా అభివృద్ధి చేశారు. అప్పుడు టీకా సమర్థత 76 శాతంగా ఉంది. అయితే మరో డోసుతో యాంటీబాడీలు గణనీయంగా పెరుగుతున్నాయని గుర్తించి టీకాను రెండు డోసుల వ్యాక్సిన్‌గా మార్చారు.
- ఈ టీకా తొలి డోసుతో వైరస్ బారిన పడే ముప్పు నుంచి దాదాపు 65 శాతం రక్షణ లభిస్తుందని వాస్తవిక గణాంకాలు(పీర్ రివ్యూ పూర్తి కావాల్సి ఉంది) వెల్లడిస్తున్నాయి. ఫైజర్ టీకా తరహాలోనే ఆస్ట్రాజెనెకా తీసుకున్న వారి ద్వారా ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశం 50 శాతం తగ్గుతుంది.
- ఆస్ట్రాజెనెకా తొలి డోసు తీసుకున్న 4 వారాల తర్వాత లభించే రక్షణతో ఆస్పత్రిలో చేరే అవకాశం తగ్గుతుంది. ఫైజర్ టీకా తొలి డోసు కూడా ఇంతే సమర్థంగా ఉంది.
ఇదీ చూడండి: వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అవసరమా?
ఎందుకు అన్ని రోజులు పడుతుంది?
ఎంఆర్ఎన్ఏ సాంకేతికతతో తయారు చేసిన ఫైజర్ టీకా అయినా, వైరల్ వెక్టార్ పద్ధతిని ఉపయోగించిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కైనా యాంటీబాడీలను ఉత్పత్తి చేయడానికి ఒకే సమయం పడుతుంది. ఆస్ట్రాజెనెకా టీకా తొలిడోసు తీసుకున్న 14 రోజుల తర్వాత శరీరంలో యాంటీబాడీలు విడుదలవుతాయి. మరో రెండు వారాల తర్వాత అవి మరింత వృద్ధి చెందుతాయి.