బంగారంతో చేసిన ఆభరణాలు, బంగారం పూత ఉన్న మొబైల్ ఫోన్లు... ఇలా చాలానే చూసే ఉంటారు. అంతెందుకు దుబాయిలోని బుర్జ్ అల్-అరబ్ హోటల్‌లోని ఎలివేటర్, లాబీని బంగారం పూతతో ఏర్పాటు చేశారు. యూఏఈలోని ఎమిరేట్స్ ప్యాలెస్‌లో సీలింగ్, గోడలకు బంగారం పూత వేశారనీ విన్నాం. లాస్ వెగాస్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్‌లో కిటికీలు కూడా బంగారంపూతతో నిర్మించారని తెలుసుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ తలదన్నేలా వియత్నాంలో ప్రయత్నం జరుగుతోంది. వాటన్నింటి కన్నా గొప్ప అనిపించుకోవాలని వియత్నాంలోని ఓ హోటల్ ఓ అడుగు ముందుకేసి హోటల్ మొత్తాన్ని బంగారంతో తాపడం చేయిస్తోంది. అవును నిజం. చాలా రోజులుగా జరుగుతున్న పనులు చివరి దశకొచ్చాయి.
డోల్స్ హనొయ్ గోల్డెన్ లేక్ హోటల్.. 2009లో మొదలైన దీని నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. ఈ ఏడాది చివర్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని యాజమాన్యం చెబుతోంది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ ఐదు నక్షత్రాల హోటల్ మొత్తం బంగారుమయమే.