చైనాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. అంతర్గతంగా వైరస్ వ్యాప్తి తగ్గినా.. విదేశాల నుంచి వస్తున్న వారికే మహమ్మారి సోకుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో కొంతమందికి లక్షణాలు లేనప్పటికీ కరోనా పాజిటివ్‌గా వస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 89 కేసులు నమోదయ్యాయని.. వీరిలో ముగ్గురు విదేశాల నుంచి వచ్చినట్లు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కరోనాకు కారణమైన వుహాన్ నగరానికి దగ్గరగా ఉన్న రష్యా సరిహద్దు వద్ద చైనా హై అలర్ట్ ప్రకటించింది. దేశంలోకి వైరస్ రాకుండా అడ్డుకునేందుకు సరిహద్దు ప్రాంతాలకు వైద్య బృందాలను పంపింది.
సూఫెన్ పట్టణంలో..
రష్యా సరిహద్దులోని సూఫెన్ పట్టణంలో ఇటీవల 22 మంది వైద్య నిపుణులతో ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. 70 వేల మంది జనాభా ఉన్న ఈ పట్టణంలో నమోదైన వెయ్యి అనుమానిత కేసుల్లో 243 మంది విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించారు. వీరిలో 100 మందికిపైగా కరోనా పాజిటివ్ వచ్చినా.. లక్షణాలు లేనట్లు గుర్తించారు. వీరిలో సగం మంది రష్యా నుంచి వచ్చినట్లు చైనా అధికారులు తెలిపారు.