బంగాళాఖాతం వేదికగా మలబార్ నౌకాదళ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. మొదటి దశలో భాగంగా విశాఖ తీరంలో ప్రారంభమైన మలబార్-20 విన్యాసాలపై చైనా ఉలిక్కిపడింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ విన్యాసాలపై చైనా విదేశాంగశాఖ స్పందించింది. ఇవి ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి దోహదపడుతాయనే అశాభావం వ్యక్తం చేసింది. విన్యాసాల్లో పాల్గొంటున్న సంబంధిత దేశాలు విరుద్ధంగా కాకుండా ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దోహదం చేస్తాయని ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
భారత్ అమెరికా, జపాన్‌లు సంయుక్తంగా చేపడుతోన్న ఈ విన్యాసాల్లో చేరేందుకు గతకొంతకాలంగా ఆస్ట్రేలియా కూడా ఆసక్తి కనబరుస్తోంది. దీంతో ఈసారి ఆస్ట్రేలియా కూడా ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నట్లు గత నెల భారత్ ప్రకటించింది. అయితే, మలబార్ విన్యాసాల ఉద్దేశంపై చైనా అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని కట్టడిచేసేందుకే ఈ వార్షిక యుద్ధ క్రీడలు నిర్వహిస్తున్నట్లు భావిస్తోంది. ఇప్పటికే అమెరికా వ్యవహార శైలితో కుదేలవుతున్న చైనాకు, తాజాగా ఆస్ట్రేలియా చేరడం వల్ల మరింత ఆందోళనకు గురవుతోంది. కరోనా వైరస్ విజృంభణతో చైనా-ఆస్ట్రేలియా మధ్య దౌత్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా క్షీణించాయి. అటు తూర్పు చైనా సముద్రం విషయంలో జపాన్‌తోనూ చైనా గొడవకు దిగింది. ఇక లద్దాఖ్ సరిహద్దులో ఏర్పడ్డ ప్రతిష్టంభన నేపథ్యంలో తాజా విన్యాసాలతో చైనా దూకుడుకు కళ్లెం పడుతుందని భారత్ అంచనా వేస్తోంది. అంతేకాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక, రాజకీయ ప్రాబల్యానికి ఈ 'చతుర్భుజ' కూటమి చెక్ పెడుతుందని ఈ నాలుగు దేశాలు భావిస్తున్నాయి.