సరిహద్దు వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తరువాత భారత్ నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు చైనా ముందుకు వచ్చింది. 5 వేల టన్నుల బాస్‌మతీయేతర బియ్యం దిగుమతులకు ఆర్డర్లు పంపింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ప్రతిపాదించిన పోటీ ధరలు తక్కువగా ఉండటంతోనే బియ్యాన్ని దిగుమతి చేసుకోవడానికి చైనా ముందుకు వచ్చిందని అఖిల భారత బియ్యం మిల్లుల సంఘం తెలిపింది.
భారత్ నుంచి చైనాకు బియ్యం ఎగుమతులు
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న వేళ రెండేళ్ల తర్వాత భారత్ నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు చైనా ముందుకు వచ్చింది. ఈ మేరకు 5 వేల టన్నుల బాస్‌మతీయేతర బియ్యం దిగుమతులకు ఆర్డర్లు పంపింది.
ఉత్పత్తి తగ్గి బియ్యం సరఫరాకు చైనా తీవ్రమైన కొరతను ఎదుర్కొంటూ ఉండడం, కరోనా నేపథ్యంలో దీని ఎగుమతులకు థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో కూడా చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ 4 మిలియన్ టన్నుల బాస్‌మతీ బియ్యాన్ని ఎగుమతి చేయగా, 5మిలియన్ టన్నుల బాస్‌మతీయేతర బియ్యాన్ని ఎగుమతి చేసింది. చైనా ఏడాదికి 4మిలియన్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకుంటోంది. బియ్యం ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉండగా, దిగుమతుల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంది.