అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఆ దేశంలోని కీలక ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే కాందహార్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న ఓ పోలీసు బృందంపై దాడి చేశారు తాలిబన్లు. వారితో ఓ పోలీసు 18 గంటల పాటు ఒంటరి పోరాటం చేశాడు. నగరంలోకి ముష్కరులు చొరబడకుండా అడ్డుకున్నాడు.
ఇదీ జరిగింది..
కాందహార్‌లోని తనిఖీ కేంద్రం వద్ద అహ్మద్ షా పహారా కాస్తుండగా.. తాలిబన్లు దాడి చేశారు. ఈ ఘటనలో షా తీవ్రంగా గాయపడినా.. లొంగకుండా వీరోచిత పోరాటం చేశాడు.
" నేను వారికి లొంగలేదు, వారిపై పోరాటం కొనసాగించా. శత్రువులు చాలా బలహీనంగా ఉన్నారు. వారి విధానాలతో మమ్మల్ని భయపెట్టాలనుకున్నారు. కానీ, నిజ జీవితంలో ఏ ఒక్కరు.. శత్రువును చూసి భయపడకూడదని నేను తెలుసుకున్నా. అఫ్గాన్ భద్రతా దళాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ.. వారిపై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకు తాలిబన్లు యత్నిస్తున్నారు."