ఆస్ట్రేలియా కార్చిచ్చు: కారులోనే ఇద్దరు సజీవ దహనం ఆస్ట్రేలియాలో చెలరేగిన దావానలం అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. విక్టోరియా, న్యూ సౌత్‌వేల్స్, దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రాల్లో వేల ఎకరాలను ఆహుతి చేస్తూ సిడ్నీ, మెల్ బోర్న్ నగరాలను కలిపే రహదారికి విస్తరించింది. అగ్ని కీలల వల్ల ఈ రెండు నగరాలకు ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కారులోనే సజీవ దహనం...
దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రంలోని కంగారూ ద్వీపంలో రహదారిపై వెళ్తున్న కారును అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఈ మంటల వల్ల వాహనంలో ఉన్న ఇద్దరు సజీవ దహనమైనట్లు అధికారులు తెలిపారు.
పలు పర్యటనలు వాయిదా...
డిసెంబరు 20న మొదలైన కార్చిచ్చు రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో భారత్, జపాన్ పర్యటనలను వాయిదా వేసుకున్నారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్.
అదనంగా 3 వేల బలగాలు...
ఈ అగ్నికీలలను అదుపు చేయటానికి 2వేలకు పైగా అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్నారు. వారికి తోడుగా మరో 3 వేల అదనపు బలగాలను పంపుతున్నట్లు మారిసన్ తెలిపారు. మంటలు చాలా ప్రమాదకరంగా మారినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కార్చిచ్చు కారణంగా తీర ప్రాంత నగరాల్లో ఉష్ణోగ్రతలు... మరింతగా పెరుగుతున్నాయి. భారీగా అలముకుంటున్న పొగ వల్ల ప్రజలు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి:చిలీ: ఆగని నిరసనలు.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం