ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 బాధితుల సంఖ్య కేవలం ఆరువారాల్లోనే రెట్టింపయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రియేసస్ ప్రకటించారు. కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించి ఆరు నెలలు పూర్తికావడంతో ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ విధంగా ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించడం చరిత్రలో ఇది ఆరోసారని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..
ఇంకా బలం పుంజుకుంటుంది..
జనవరి 30న తాము అత్యయిక స్థితిని ప్రకటించే సమయంలో చైనా వెలుపల వంద కంటే తక్కువ కేసులుండగా, మరణాలు నమోదుకాలేదని టెడ్రోస్ అథనోమ్ గుర్తు చేశారు. తమ వద్దనున్న గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు అంతర్జాతీయంగా సుమారు కోటి అరవై లక్షల కొవిడ్ కేసులు నమోదు కాగా 6,40,000 మంది మృతిచెందారన్నారు. ఇంతటితో సరికాదని..ఈ మహమ్మారి ఇంకా బలం పుంజుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘కొవిడ్-19 ప్రపంచాన్నే మార్చివేసింది. ఇది ప్రజలను, జాతులను, దేశాలను దగ్గర చేస్తూనే విభజించింది కూడా. మనిషి బలాన్ని, బలహీనతను కూడా తేటతెల్లం చేసింది. దీని ద్వారా మనం ఎంతో నేర్చుకున్నాం.. అయితే మరెంతో నేర్చుకోవాల్సి ఉంది’’ అని తెలిపారు.