ప్రపంచంలోని కరోనా కేసుల్లో అధిక శాతం తక్కువ ఉష్ణోగ్రత, గాలిలో తేమ లేదా ఆర్ద్రత తక్కువగా గల దేశాల్లోనే నమోదైనట్టు ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 90 శాతం కరోనా కేసులు 3 నుంచి 17 డిగ్రీల ఉష్ణోగ్రత, గాలిలో తేమ క్యూబిక్ మీటర్‌కు 4 నుంచి 9 శాతం కంటే తక్కువగా ఉన్న దేశాల్లోనే ఉన్నట్లు ఈ అధ్యయనం తెలియచేసింది.
ఐరోపాలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో... మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది.
విశ్లేషణతో నిరూపితం....
గత అభిప్రాయాలకు భిన్నంగా, ఉష్ణోగ్రత మాత్రమే కాకుండా ఆర్ద్రత కూడా కొవిడ్-19 వ్యాప్తిలో ముఖ్యపాత్ర పోషిస్తోందని ఎంఐటీకి చెందిన శాస్త్రవేత్తలు గణాంకాల విశ్లేషణ ద్వారా నిరూపించారు.
మార్చి 22 వరకు లభించిన కరోనా వైరస్ వ్యాప్తి సంబంధిత గణాంకాలను మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అమెరికా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆ ఫలితాలను బట్టి కరోనా వైరస్ వ్యాప్తి ఉష్ణోగ్రత, వాతావరణంలో తేమ అనే రెండు అంశాలపై ఆధారపడి ఉందని వారు పేర్కొన్నారు. వేడి, తేమ అధికంగా ఉన్న వాతావరణం కరోనా వ్యాప్తిని నిరోధిస్తుందని వారు అంటున్నారు.
తేమ కారణంగానే ఇక్కడ తక్కువ తీవ్రత...
భారత్‌తో సహా అన్ని ఆసియా దేశాల్లో రుతుపవనాల రాకతో గాలిలో తేమ క్యూబిక్ మీటర్‌కు 10 గ్రాముల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. కాగా ఈ విధమైన వాతావరణ పరిస్థితులు కరోనా మహమ్మారి వ్యాప్తిని ఆలస్యం చేసాయని... దీనితో ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000 కరోనా మరణాలు నమోదుకాగా.. దేశంలో మరణాలు 10కి పరిమితం అయ్యాయని పరిశోధకులు విశ్లేషించారు. అంతే కాకుండా...
- జనవరి 22 నుంచి మార్చి 21 మధ్య తక్కువ ఉష్ణోగ్రత, తేమ (4-10 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, క్యూబిక్ మీటర్‌కు 3-9 గ్రా.) ఉన్న ప్రాంతాల్లో అధిక కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇక మార్చి 11-19 మధ్యకాలంలో 18 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రత ఉన్న దేశాల్లో పెరుగుదల, 8-12 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత గత దేశాల కంటే తక్కువే.
- ఇక ఆర్ద్రత క్యూబిక్ మీటర్‌కు 9 గ్రా. కంటే ఎక్కువగా ఉన్న దేశాల్లో గత మూడునెలల్లో కరోనా కేసులు ఆరు శాతం తక్కువ.
- అమెరికా, యూరప్‌లలో రానున్న వేసవికాలం పొడిగా ఉంటుంది. ఈ పరిస్థితి కరోనా నిరోధానికి అంత అనుకూలం కాదని కూడా ఈ విశ్లేషణ ద్వారా తెలుస్తోంది.
ఇతర దేశాల్లో కరోనా కేసులు ఆందోళనకరంగా పెరుగుతుండగా.. 18 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువున్న ఉష్ణమండల దేశాల్లో గతవారం మొత్తానికి 10,000 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఇందుకు కారణం ఈ ప్రాంతాల్లో అధిక వేడి, తేమ ఉండటమే అని పరిశోధకులు తెలిపారు. అయితే, దీనిపై పూర్తిగా నిర్థారణకు రావడానికి సమయం పడుతుందని, ఒక సైకిల్ పూర్తి కావాలని పరిశోధకులు చెబుతున్నారు.