కరోనాపై పోరులో భారత్కు మరో విడత ఆర్థిక సాయం ప్రకటించింది అమెరికా. యూఎస్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్ ఏఐడీ) ద్వారా మరో 3 మిలియన్ డాలర్లు అందిస్తున్నట్లు తెలిపింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే ఈనెల 6న యూఎస్ ఏఐడీ సుమారు 2.9 మిలియన్ డాలర్లు భారత్కు ఇస్తున్నట్లు ప్రకటించింది.
భారత్లోని అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ అదనపు నిధులు.. ఇరు దేశాల మధ్య బలమైన, నిరంతర భాగస్వామ్యానికి మరో ఉదాహరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.
యూఎస్ ఏఐడీ అనేది ప్రముఖ అంతర్జాతీయ సహాయ సంస్థలో ఒకటి. పహల్ ప్రాజెక్టు కింద భారత్కు ఈ నిధులను అందిస్తోంది. కొవిడ్-19పై పోరు కోసం ఇప్పటి వరకు భారత్ కు 5.9 మిలియన్ డాలర్ల సాయం చేశాం. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం, బాధితులకు చికిత్స, ప్రజలకు అవగాహన కల్పించటం, కేసుల గుర్తింపు చర్యలను పటిష్ఠం చేయటం, నిఘా వంటి వాటికి ఈ నిధులు ఉపయోగించాలి.