భౌతిక దూరం నిబంధనలను పొడిగించేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అమెరికాలో విధించిన ఆంక్షల గడువు నేటితో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆర్థిక సంక్షోభం..
అమెరికాలో తొలుత 15 రోజుల పాటు భౌతిక దూరం నిబంధనలను అమలు చేశారు. అనంతరం వాటిని 30 రోజుల వరకు పొడిగించారు. ఫలితంగా 95 శాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమతమయ్యారు. చాలా పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడ్డాయి.
కరోనా సంక్షోభంతో అమెరికాలో 2.6 కోట్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య 3 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అమెరికాలోని 50 రాష్ట్రాలకు గాను 35 రాష్ట్రాల్లో కార్యకలాపాలను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ఆంక్షల సడలింపులపై తమ వ్యూహాలను విడుదల చేశాయి.
భవిష్యత్‌పై ట్రంప్ ధీమా...
అమెరికాలో కరోనా మృతుల సంఖ్య బుధవారం భారీగా పెరిగింది. ఒక్క రోజే 2,502 మంది మరణించారు. ఫలితంగా ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 61 వేలు దాటింది. మొత్తం 10.65 లక్షల మందికి కరోనా సోకగా.. 1.47 లక్షల మంది కోలుకున్నారు.