అమెరికా అవసరాలకు మించి అదనంగా కొవిడ్ టీకా ఉత్పత్తి జరిగితే.. వాటిని ప్రపంచ దేశాలకు అందిస్తామని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇప్పటికే ఆ దిశగా కొవాక్స్‌తో ఒప్పందం కూడా చేసుకున్నామన్నారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా టీకా ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు 400 కోట్ల డాలర్లు కేటాయించినట్లు ఆయన వివరించారు.
అమెరికన్ల రక్షణకే ప్రాధాన్యం..
గోడలు కట్టడం ద్వారా ఆ మహమ్మారి నుంచి రక్షణ పొందలేమని ఆ గోడ ఎంతదైనా ప్రపంచం మొత్తం సురక్షితంగా మారేవరకూ ఎవరూ తప్పించుకోలేరని బైడెన్ అన్నారు. అందుకే ముందు అమెరికన్ల రక్షణకు ప్రాధాన్యమిస్తామని అ తర్వాత ప్రపంచదేశాలకు కూడా అండగా నిలబడతామని బైడెన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో జాన్సన్ అండ్ జాన్సన్.. మెర్క్ మధ్య కుదిరిన భాగస్వామ్యాన్ని ప్రశంసించిన బైడెన్.. తద్వారా అమెరికాలో మరో 10 కోట్ల డోస్‌ల టీకా అదనపు ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు.