కొన్ని సంఘటనల గురించి వింటే ఇలా కూడా జరుగుతాయా? ఆని ఆశ్చర్యమేస్తుంది. అమెరికా మసాచుసెట్స్‌లోని ప్రావిన్స్ టౌన్‌కు చెందిన ఓ సీనియర్ డైవర్ వ్యవహారం కూడా ఇంతే! తిమింగలం మింగినా కూడా ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ విషయాన్ని ఆయనే నమ్మలేకపోతున్నారు. తాను మళ్లీ భార్యా బిడ్డలను చూస్తానని ఊహించలేదని చెప్పాడు.
గాల్లో ఎగిరిపడి..
కేప్ కాడ్ సముద్ర తీరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 11 ఉదయం 8 గంటలకు మైకేల్ ప్యాకర్డ్ అనే 56ఏళ్ల డైవర్.. మరో వ్యక్తితో కలిసి ఓడలో సముద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఉష్ణోగ్రత 60 డిగ్రీలు, నీటి దృశ్యమానత 20 అడుగులుగా ఉంది. ఎప్పటిలానే సముద్రంలోకి డైవ్ చేసిన మైకేల్‌కు చేపలు గుంపులుగా కన్పించాయి. ఇంతలోనే తనను ఏదో బలంగా తోస్తున్నట్లు అనిపించింది. క్షణాల్లోనే మొత్తం అంధకారమైంది.
అప్పుడే తనపై ఓ తిమింగలం దాడి చేసిందని అనుమానం వచ్చినట్లు మైకేల్ తెలిపాడు. కానీ దాని దంతాలు తాకినట్లు గానీ, నొప్పిగా ఉన్నట్లు గానీ అనిపించేలేదని పేర్కొన్నాడు. చివరికి.. తాను తిమింగలం నోట్లో ఉన్నానని, అది తనను మింగేందుకు ప్రయత్నిస్తోందని అర్థమైనట్లు ఆ నాటి భయానక పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు. తన భార్యా బిడ్డలను ఇక చూడబోనని, ఆసమయంలో అనుకున్నట్లు చెప్పాడు. 30సెకన్ల పాటు తిమింగలం నోట్లేనే ఉన్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత తిమింగలం నీటిపైకి వచ్చి ఉమ్మేయడం వల్ల తాను గాల్లో ఎగిరి నీటిలో పడినట్లు మైకేల్ చెప్పాడు.
చివరికి.. ఓడలో వెళ్లిన మరో వ్యక్తి మైకేల్‌ను కాపాడాడు. మైకేల్ గాల్లోకి ఎగిరి నీటిలో పడటాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్లు ఆ వ్యక్తి చెప్పాడు.
ఈ ఘటనలో కాళ్లు విరిగి ఆసుపత్రిలో చేరిన మైకేల్.. కొద్ది రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం కర్ర సాయంతో నడుస్తున్నాడు.
ఇదీ చూడండి:-కరోనాపై కసితో 365 రోజులుగా సరస్సులో ఈత!