ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి రేపుతున్న కల్లోలం ప్రజారోగ్యాన్నే కాకుండా ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులనూ తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు తాజాగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) నివేదిక వెల్లడించింది. 2022లో 20.5 కోట్ల మంది నిరుద్యోగులయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈమేరకు ఐరాసకు చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 'వరల్డ్ ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ అవుట్‌లుక్: ట్రెండ్స్ 2021' పేరిట బుధవారం నివేదికను విడుదల చేసింది.
2019తో పోలిస్తే ప్రస్తుతం అదనంగా 10.8 కోట్ల మంది కార్మికులను 'పేదలు లేదా నిరుపేదలు'గా మహమ్మారి మార్చిందని ఐరాస పేర్కొంది. పేదరిక నిర్మూలన దిశగా ఐదేళ్లుగా సాధించిన వృద్ధిని నష్టపోయినట్లయిందని తెలిపింది. నిర్దిష్టమైన చర్యలు చేపట్టకపోతే ఏళ్ల తరబడి సామాజిక, ఉపాధి పరిస్థితులపై మహమ్మారి ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. కనీసం 2023 వరకు ఉద్యోగ వృద్ధి తగినంతగా ఉండదని, నష్టాలు తప్పవని పేర్కొంది. కొవిడ్ మహమ్మారి నుంచి కోలుకోవడం అంటే కేవలం అది ఆరోగ్యపరమైన అంశం మాత్రమే కాదని.. ఆర్థిక, సామాజిక అవసరాలను అది తీవ్రంగా దెబ్బతీసిందని ఐఎల్‌ఓ డైరెక్టర్ జనరల్ గై రైడర్ తెలిపారు. ఉద్యోగాల పెంపు, సమాజంలో అత్యంత దుర్బల స్థితిలో ఉన్నవారికి చేయూత, తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాల రికవరీ వంటివాటికి నిర్దిష్టమైన కృషి జరగాల్సి ఉందన్నారు.