తెలంగాణ

telangana

ETV Bharat / international

స్కూల్స్, రెస్టారెంట్స్​లో ఇక ఇలా చేయాల్సిందే!

ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించిన ట్రంప్​ సర్కారు.. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రచిస్తోంది. కరోనా కారణంగా మూతపడ్డ పాఠశాలలను.. విద్యాసంవత్సరం ముగింపునకు ముందే ప్రారంభించేలా చూడాలని ఆయా రాష్ట్రాలను కోరారు ట్రంప్​. ఇతర ముఖ్య రంగాల కార్యకలాపాలపైనా కొత్త మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కరోనా కట్టడికి.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూనే ఆంక్షల్ని క్రమంగా సడలించనున్నారు.

Trump urges states to consider opening schools before summer
లాక్​డౌన్​ తర్వాత ఈ రూల్స్​ తప్పక పాటించాల్సిందే!

By

Published : Apr 28, 2020, 4:25 PM IST

కరోనా కారణంగా స్తంభించిన అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాల్లో కార్యకలాపాల పునరుద్ధరణపై దృష్టి సారించింది ట్రంప్ సర్కారు. వేర్వేరు రాష్ట్రాల్లో క్రమంగా ఆంక్షల్ని ఎత్తివేయాలని చూస్తోన్న నేపథ్యంలో ట్రంప్​ సర్కార్​ కొత్త నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను జారీ చేయనుంది. ఇప్పటికే సంబంధిత ముసాయిదాను.. అమెరికాలోని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) శ్వేతసౌధానికి పంపించినట్లు సమాచారం.

ఆరడుగుల దూరం తప్పనిసరి...

తరగతి గదుల్లో విద్యార్థుల డెస్కుల మధ్య 6 అడుగుల దూరం ఉండాలని సీడీసీ ప్రతిపాదించింది. పాఠశాలకు సంబంధించి ఆన్​లైన్​ తరగతులను ప్రోత్సహించడం, మధ్యాహ్న భోజనాన్ని క్యాఫిటేరియాకు బదులు తరగతి గదిలోనే తినేలా చేయడం వంటివి ప్రధాన సిఫార్సులుగా ఉన్నాయి.

ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా శిశు సంరక్షణ కేంద్రాలు, ప్రార్థనా స్థలాలు, పనిప్రదేశాలు, బార్లు, రెస్టారెంటు కార్యకలాపాల్లో మార్పులను ప్రతిపాదించింది సీడీసీ.

చర్చిల్లో...

చర్చి కార్యకలాపాలను వీలైనంత ఎక్కువగా ఆరుబయట ప్రదేశంలో నిర్వహించాలని సీడీసీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సభ్యుల మధ్య ఆరు అడుగుల దూరం పాటించడం సహా అందరూ మాస్కులను ధరించాలని సూచించింది.

రెస్టారెంట్లలో...

రెస్టారెంట్లలో ఒక్కసారి వాడిపారేసే సామగ్రినే వాడాలని సీడీసీ ప్రతిపాదించింది. ఇందులో ఫోర్కులు, చెంచాలు గురించి ప్రధానంగా ప్రస్తావించింది. షిప్టుల వారీగా పరిమిత సంఖ్యలో సిబ్బంది ఉండాలని సూచించింది.

వ్యాపారాలను ఎవరైనా పునఃప్రారంభించాలంటే.. ఎలా చేయాలనుకుంటున్నారో సమగ్రంగా రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించాల్సి ఉంటుందని న్యూయార్క్​ గవర్నర్​ అండ్రూ క్యూమో పేర్కొన్నారు.

వేసవికి ముందే తెరవండి!

ముఖ్యంగా పాఠశాలల పునఃప్రారంభంపై దృష్టి సారించింది ట్రంప్ సర్కార్. గవర్నర్లతో సోమవారం సమావేశమైన అధ్యక్షుడు.. ఈ వేసవికి ముందే స్కూళ్లు తెరిచే అంశాన్ని పరిశీలించాలన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇందుకు సుముఖంగా లేనప్పటికీ ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

''మీరు పాఠశాలలు తెరిచే విషయంపై ఆలోచించొచ్చు. ఎందుకంటే.. చాలా మంది ప్రజలు అదే కోరుకుంటున్నారు. ఇది పెద్ద విషయమేం కాదు. విపత్తు సమయంలోనూ పిల్లలు బాగానే ఉన్నారు. మీరు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి.''

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

అయితే.. ట్రంప్​ చేసిన సూచనలపై గవర్నర్లు ఎవరూ స్పందించనట్లు సమాచారం. విద్యా సంవత్సరం చివర్లో ఇంత తొందరగా పాఠశాలలు ప్రారంభించడం మంచిది కాదని, చిక్కులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తాము తిరిగి ఉద్యోగాలకు వెళ్లాలంటే.. పిల్లలకు పాఠశాల కంటే సురక్షిత ప్రదేశమేదీ కనిపించట్లేదని భావిస్తున్నారు.

పీపీఈలు ఉండాల్సిందే...

అమెరికాలో విద్యాసంస్థలకు కేంద్రంగా ఉన్న లాస్​ఏంజెలిస్​ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం.. పాఠశాలలు తిరిగి తెరవాలంటే ముందస్తు జాగ్రత్తలు చాలానే పాటించాలని చెప్పాయి. అమెరికన్​ ఫెడరేషన్​ ఆఫ్​ టీచర్స్​ మాత్రం.. స్కూళ్లలో టెస్టింగ్​ కిట్లు, వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు(పీపీఈ)లు ఉండాలని సూచించాయి.

ABOUT THE AUTHOR

...view details