'మూర్ఖంగా ప్రవర్తిస్తే.. భారీ మూల్యం చెల్లించకతప్పదు' ఇరాన్ డ్రోన్‌ను అమెరికా యుద్ధ నౌక ధ్వంసం చేసిందని, ఈ అంశమై ఎలాంటి అనుమానాలకు తావులేదని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తమతో ఘర్షణకు దిగితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు.
హోర్ముజ్ జలసంధి వద్ద గురువారం నాడు ఇరాన్ డ్రోన్‌ను కూల్చివేశామని ట్రంప్ పునరుద్ఘాటించారు. డ్రోన్ కూల్చివేతకు సాక్ష్యంగా వీడియో సహా ఇతర ఆధారాలను అధ్యక్ష కార్యాలయం, రక్షణ విభాగం పెంటగాన్ విడుదల చేయలేదు.
"అమెరికా యుద్ధనౌకకు 915 మీటర్ల సమీపానికి ఇరానియన్ డ్రోన్ వచ్చింది. వెనక్కు వెళ్లాలని పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా విస్మరించింది. తప్పని పరిస్థితుల్లో రక్షణాత్మక చర్యగా యూఎస్ఎస్ బాక్సర్ యుద్ధనౌక ఆ డ్రోన్‌ను నేలకూల్చింది. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు." - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
అమెరికా జాతీయ భద్రత సలహాదారు జాన్బోల్డన్ కూడా ఇరాన్ డ్రోన్‌ను అమెరికా యుద్ధనౌక కూల్చివేసిందని స్పష్టం చేశారు.
మా డ్రోన్లన్నీ సురక్షితం...
పర్షియన్ గల్ఫ్‌లోని తమ డ్రోన్లన్నీ సురక్షితంగా స్థావరాలకు చేరుకున్నాయని ఇరాన్ సాయుధ దళాలు స్పష్టం చేశాయి.
'భారీ మూల్యం చెల్లించక తప్పదు..'
ఇరాన్‌తో ఘర్షణపై అమెరికాకు ఏ మాత్రం ఆందోళన లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. సున్నితమైన హోర్ముజ్ ప్రాంతంలో 'మూర్ఖపు చర్యలకు దిగితే' ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
"ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులు మనకు ఉన్నారు. మన వద్ద ప్రపంచంలోనే గొప్ప పరికరాలు ఉన్నాయి. భయంకరమైన గొప్ప ఓడలు మన దగ్గర ఉన్నాయి. మేము వాటిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. వారు (ఇరాన్) మూర్ఖంగా ఏమీ చేయబోరని మేము ఆశిస్తున్నాం. ఒక వేళ వారు అలాంటి పనులు చేస్తే, ఎవరూ చెల్లించనటువంటి భారీ మూల్యం చెల్లించక తప్పదు."- డొనాల్డ్ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
పశ్చిమాసియాలో పరస్పరం రెచ్చ గొట్టుకుంటున్న అమెరికా, ఇరాన్‌లు ఉద్రిక్తతలను తారస్థాయికి తీసుకుపోతున్నాయి.
ఇదీ చూడండి: చంద్రయాన్: తొలి అడుగుకు అర్ధ శతాబ్దం